హతవిధీ.!

12 Nov, 2018 07:16 IST|Sakshi
యారాడ బీచ్‌ వద్ద గుమిగూడిన స్థానికులు

పండగ పూట పెను విషాదం

యారాడ బీచ్‌లో ఆరుగురు యువకుల గల్లంతు

ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న సిబ్బంది

రంగంలోకి దిగిన నేవీ దళం

సంఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌

విశాఖపట్నం, గాజువాక/మద్దిలపాలెం: పండగ పూట సరదాగా గడుపుదామనుకున్న ఆ యువకుల కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. తమ కళ్లముందే స్నేహితులు సముద్రంలో గల్లంతు కావడంతో మిగతా వారిని దుఃఖసాగరం కమ్మేసింది. యారాడ బీచ్‌కు వచ్చిన యువకుల్లో ఆరుగురు ఆచూకీ కనుమరుగు కావడంతో నగరం ఉలిక్కి పడింది. బీచ్‌లో గల్లంతైనవారంతా 22 ఏళ్ల లోపువారే. కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో ఉపాధి బాట పట్టారు. చదివిన ఐటీఐ కోర్సునే ఆధారంగా ఎలక్ట్రీషియన్లుగా కొందరు పనిచేస్తున్నారు. మరికొందరు విద్యార్థులు.

నగరంలోని హెచ్‌బీ కాలనీ పరిసర ప్రాంతాలకు చెందిన 12 మంది స్నేహితులు నాగులచవితి కావడంతో పిక్నిక్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో యారాడ బీచ్‌కు ఆటోలో చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు సముద్ర పరిసరాల్లో సరదాగా గడిపి మధ్యాహ్న భోజనం ముగించుకున్నారు. ఆ తరువాత 2.30 గంటల సమయంలో సముద్ర స్నానానికి దిగిన కొద్ది సేపటికే వచ్చిన భారీ అల ఆరుగురిని సముద్రంలోకి లాక్కెళ్లిపోయింది. ఇద్దరు సముద్రం ఒడ్డునే ఉండిపోగా, మిగిలిన పది మంది సముద్రంలోకి దిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముగ్గురు ఒక చోట, మిగిలిన ఏడుగురు ఒకచోట స్నానం చేస్తుండగా సముద్ర అల ఆ ఏడుగురినీ లాక్కెళ్లిపోయింది. వారిలో బాలు అనే వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఓ లైఫ్‌ గార్డ్‌ అతడిని రక్షించగలిగాడు.

మిగిలిన వారిలో హెచ్‌బీ కాలనీ దుర్గానగర్‌కు చెందిన దేవర వాసు (21), పేరిడి తిరుపతి (21), చాకలిపేట భానునగర్‌కు చెందిన కోన శ్రీనివాస్‌ (21), నక్క గణేష్‌ (17), దుర్గ్గ (21), కేఆర్‌ఎం కాలనీకి చెందిన రాజేష్‌ (21) గల్లంతైనట్టు ప్రమాదం నుంచి బయటపడ్డ బాలు తెలిపాడు. దేవర వాసు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పేరిడి తిరుపతి సాంకేతిక కళాశాలలో ఐటీఐ విద్యనభ్యసిస్తున్నాడు. కోన శ్రీనివాస్, నక్కా గణేష్, దుర్గా ఒక ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ షాప్‌లో, రాజేష్‌ ఫొటో స్టూడియోలో పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయానికి వరకు గల్లంతైనవారి ఆచూకీ  తెలియరాలేదు. వారికోసం పోలీసులు, యారాడకు చెందిన గజ ఈతగాళ్లు విరామం లేకుండా గాలిస్తున్నారు. నేవీ దళం కూడా రంగంలోకి దిగింది. సమాచారం అందుకున్న కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంఘటనస్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు ఆయన అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కూడా ఇక్కడకు చేరుకుని సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. మల్కాపురం సీఐ కేశవరావు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

బాధితులకు వంశీకృష్ణ పరామర్శ
వైఎస్సార్‌ సీపీ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్, ఆ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు, మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీ అప్పారావు, కన్నారావులు బాధిత కుటుం బాలను కలసి పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కంటి పాపల కోసం ఎదురుచూపులు
యువకులు గల్లంతవడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. పండగ పూట వారి ఇళ్లు రోదనలతో మిన్నంటాయి. గల్లంతైన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. వయసులో చిన్నవాళ్లయినప్పటికీ.. కుటుంబ పోషకులుగా ఉన్నారు. తమ బిడ్డలు తిరిగి వస్తారనే ఆశతో వారంతా ఎదురుచూస్తున్నారు.

ఒంటరైన తల్లి
తండ్రి చనిపోవడంతో ఆటో నడుపుకుంటూ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు దేవర వాసు. అతను గల్లంతయ్యాడన్న వార్త ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లి బోరున విలపించారు. వీరిది విజయనగరం. వాసు తండ్రి చనిపోవడం, అక్కకు వివాహ కావడంతో.. వీరు నగరానికి వలస వచ్చారు. 9వ వార్డులోని దుర్గానగర్‌ కొండ ప్రాంతంలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు.

.అన్నయ్య తిరిగి వస్తాడు
తల్లిదండ్రులు దినసరి కూలీలు. వారి ఒక్కగానొక్క కొడుకు సోమిరెడ్డి దుర్గ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇంతలో స్నేహితులతో కలసి కొడుకు సముద్రంలో కొట్టుకుపోయడాని తెలిసి ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. అన్నయ్య తిరిగి వస్తాడంటూ తల్లిదండ్రులను అతని చెల్లి ఓదార్చి న తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.

వృద్ధుల వేదన వర్ణనాతీతం
విజయనగరం జిల్లా జమ్మయ్యపేటకు చెందిన నక్కా గణేష్‌ తల్లి రెండేళ్ల కిందట చనిపోయారు. దీంతో రజకవీధిలో ఉంటున్న అమ్మమ్మ, తాతయ్య వద్దకు గణేష్‌ వచ్చేశాడు.  ఇక్కడే ఉంటూ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసుకుంటున్నాడు. తండ్రి రమణ సొంత ఊరిలో కూలీగా జీవనం సాగిస్తున్నాడు. గణేష్‌ గల్లంతయ్యాడన్న వార్తతో ఆ వృద్ధులు బోరున విలపిస్తున్నారు.

శోకసంద్రంలో తల్లిదండ్రులు
విజయనగరం జిల్లా నిమ్మవలసకు చెందిన కోనా ఆదినారాయణ, రామలక్ష్మీల ఆఖరి సంతానం కోనా శ్రీనివాస్‌. స్నేహితులతో కలసి పిక్‌నిక్‌ వెళ్లి సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్‌కు అక్క, అన్నయ్య ఉన్నారు.

ముద్దుల కొడుకు వస్తాడని..
దౌలపల్లి రాజేష్‌ దివ్యాంగుడు. ఫొటోషాప్‌ నేర్చుకుని రామా టాకీస్‌ వద్ద సాయి రోహిణిలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌ వెళ్లిన కొడుకు గల్లంతయ్యాడనే సమాచారంతో ఆ ఇంట విషాదం నెలకొంది. తండ్రి నారాయణరావు షిప్పింగ్‌ హార్బర్‌లో కూలీగా పనిచేస్తున్నాడు.  

పుట్టలో పాలు పోసి సందడిగా గడిపాడు
తన కుమారుడి తిరుపతి భవిష్యత్‌ కోసం ఆ తల్లి కలలు కన్నారు. ఇప్పుడు అతను  గల్లంతయ్యాడన్న వార్త ఆమెలో విషాదం నింపింది. ఉదయమే అమ్మ, చెల్లితో కలిసి పుట్టలో పాలు సందడి చేశాడు. అనంతరం స్నేహితులతో కలసి యారాడ వెళ్లాడు. ఇప్పుడు గల్లంతయ్యాడన్న వార్తతో తల్లి కుమారి, చెల్లి స్వప్నలిద్దరూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి చనిపోయిన తరువాత తల్లి కుమారి కూలి పని చేసుకుంటూ కుమారుడిని పి.ఎం.పాలెంలోని సాంకేతిక కళాశాలలో ఐటీఐ చదివించారు. తిరుపతి చదువుకుంటూనే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నాడు. వీరు విజయనగరం నుంచి ఇక్కడకు వలస వచ్చి.. దుర్గానగర్‌ కొండపై అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. 

>
మరిన్ని వార్తలు