మరో ఘోరం : అదే ఆసుపత్రిలో అస్థిపంజరాల కలకలం

22 Jun, 2019 14:54 IST|Sakshi

ఎస్‌కెఎంసిహెచ్‌లో మరో దారుణం

వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు, ఎముకల కలకలం

సాక్షి, పట్నా:  బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఆసుపత్రిలోమరో దిగ్భ్రాంతికరమైన పరిణామం  చోటు చేసుకుంది.  మెదడువాపు వ్యాధి  (అక్యూట్ ఎన్‌సెఫాలిటిస్ సిండ్రోమ్, ఏఈఎస్‌)  ద్వారా పసిపిల్లల మరణాలతో (శనివారానికి 108 మంది) వార్తల్లో నిలిచిన శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఎస్‌కెఎంసిహెచ్)కి సంబంధించి మరో దారుణం వెలుగులోకి వచ్చింది.  ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న  ఈ ఆసుపత్రి  సమీపంలో వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు దర్శనమివ్వడం స్థానికులను భయ భ్రాంతులకు గురిచేసింది. మృతదేహాలలో  కొన్నింటిని  కాల్చివేసినట్టు, మరికొన్నింటిని సగం పూడ్చినట్టుగా, ఇంకొన్నింటిని బస్తాలలో కుక్కి అక్కడ పడి వున్నాయి.  ఇలా పెద్ద ఎత్తున మానవ అవశేషాలు  బయటపడటం  కలకలం  రేపుతోంది.

ఇది ఆసుపత్రికి చెందిన పోస్ట్‌మార్టం విభాగం నిర్వాకమని విమర్శలు వెల్లువెత్తాయి.  పోస్టుమార్టం తరువాత మృతదేహాలను ఇలా బహిరంగం పారేసినట్టుగా తెలుస్తోందని  ఆసుపత్రి  కేర్ టేకర్ జనక్ పాస్వాన్  మీడియాకు చెప్పారు. ఇది నిజంగా అమానవీయమని వ్యాఖ్యానించిన  ఆసుపత్రి సూపరింటెండెంట్‌  ఎస్‌కే షాహి సమగ్ర దర్యాప్తును కోరనున్నట్టు  చెప్పారు.

పోలీసులతో కలిసి ఎస్‌కెఎంసిహెచ్ ఆసుపత్రి దర్యాప్తు బృందం శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించింది. ఆసుపత్రికి చెందిన డాక్టర్ విపిన్ కుమార్ మాట్లాడుతూ, అస్థిపంజర అవశేషాలు కనుగొన‍్నమాట వాస్తవమేనని సవివరమైన సమాచారం ప్రిన్సిపాల్  నుంచి రాబట్టనున్నామని చెప్పారు. మరోవైపు  ఏదైనా మృతదేహం ఒక ఆసుపత్రికి వచ్చినప్పుడు, వెంటనే సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించి, దీనికి సంబంధించి ఒక నివేదికను దాఖలు చేయాలి.  అనంతరం శవాన్ని 72 గంటలు పోస్టుమార్టం గదిలో ఉంచాలి. 72 గంటల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కుటుంబ సభ్యులెవరూ రాకపోతే, నిర్దేశించిన విధానాన్ని అనుసరించి మృతదేహాన్ని ఖననం చేయడం లేదా దహనం చేయడమో  చేయాలని  పోస్ట్‌మార్టం విభాగం  డ్యూటీ  అని షాహి చెప్పారు.

మరిన్ని వార్తలు