క్షణాల్లో గల్లంతవుతున్న స్మార్ట్‌ ఫోన్లు

16 Dec, 2019 10:44 IST|Sakshi

ఈ–లాస్ట్‌ యాప్‌కు లక్షల్లో ఫిర్యాదులు

ఆచూకీ కనిపెట్టే విషయంలో చొరవ తీసుకోని పోలీసు శాఖ

చోరీకి గురైన స్మార్ట్‌ ఫోన్ల విలువ రూ.వంద కోట్లు?

కర్ణాటక, బనశంకరి: అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్స్‌ఫోన్స్‌ క్షణాల్లో మాయమవుతున్నాయి. హోటల్స్‌ తదితర వాటికి వెళ్లినప్పుడు, లేదా, ఆటో, క్యాబ్‌ల్లో వెళ్తూ  ఫోన్లను మరచి పోయి వెళ్తున్నారు. మరో వైపు దొంగలు కూడా అతి లాఘవంగా సెల్‌ఫోన్లను చోరీ చేస్తున్నారు. ఇలా సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నవారు సిలికాన్‌ సిటీల లక్షల సంఖ్యలో ఉన్నారు.  స్మార్ట్‌ ఫోన్లు గల్లంతైనప్పుడు ఫిర్యాదు చేసేందుకు  బెంగళూరు నగర పోలీసులు ఈ– లాస్ట్‌ యాప్‌ ప్రవేశపెట్టగా ఒక ఏడాదిలోనే 97,963 ఫిర్యాదులు అందాయి.  మొబైల్స్‌ సరాసరి విలువ రూ.10 వేలు కాగా మొత్తం గల్లంతైన ఫోన్ల విలువ రూ.వంద కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  బస్సుల్లో ప్రయాణించే సమయంలో, హోటళ్లు, మాల్స్‌లో సంచరించే సమయంలో లేదా కాలినడకన వెళ్తుండగా  మొబైల్‌ పోగొట్టుకుని అది దొరకని పక్షంలో దానిని చోరీ వస్తువుగా పరిగణిస్తారు. అలాంటి సందర్బాల్లో ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న  ఇ–లాస్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఫిర్యాదు చేసి రసీదు పొందవచ్చు.కాగా  మిస్సింగ్‌ అవుతున్న ఎడ్యుకేషన్‌ రికార్డులు, పాన్‌కార్డ్స్, గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్‌లు కూడా మిస్సింగ్‌ అవుతున్న వాటి జాబితాలో సెల్‌ఫోన్ల సంఖ్యకే ఎక్కువ.

ఆచూకీ కష్టతరం కాదు...
చోరీకి గురైన మొబైల్‌పోన్ల  ఆచూకీ కనిపెట్ట డం కష్టతరం కాదు. ప్రతి మొబైల్‌కు ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఇక్విప్‌మెంట్‌ ఐడెంటిపికేషన్‌(ఐఏంఇఐ) నెంబరు ఉంటుంది. టెలికాం కంపెనీలకు ఇఏఇఐ సమాచారం అందించి ఏదైనా సిమ్‌కార్డుతో యాక్టివేట్‌ చేసినప్పుడు సమాచారం తెలుసుకోవాలని పోలీసులకు మనవిచేయాలి. కానీ పోలీస్‌శాఖ ఉన్నతాధికారులకు ఆసక్తిలేకపోవడంతో మొబైల్స్‌ ఆచూకీ కనిపెట్టడంలేదు. ఈ విషయంపై నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ మాట్లాడుతూ   ఇ –లాస్ట్‌లో నమోదైన  ఫిర్యాదులకు సంబందించి విచారణ చేపట్టడంలేదన్నారు.  రానున్న రోజుల్లో మొబైల్‌పోన్లు లాంటి విలువైన వస్తువుల ఆచూకీ కనిపెట్టడం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు.

ఈ లాస్ట్‌ యాప్‌కు అందిన ఫిర్యాదులు
2017        – 84,898  
 2018        – 91,564
2019        –97963

మరిన్ని వార్తలు