గంటలో మూడు ఫోన్లు చోరీ

27 Aug, 2019 12:06 IST|Sakshi

శనివారం తెల్లవారుజామున వరుస పెట్టి నేరాలు

నిందితుడి అరెస్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: ఒకే రోజు గంట వ్యవధిలో మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడిన నిందితుడిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ సోమవారం వెల్లడించారు. ఆజంపూరకు చెందిన మహ్మద్‌ మోసిన్‌ ఏడో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. జీవనోపాధి కోసం గతంలో కోఠిలో పండ్ల వ్యాపారం చేసేవాడు. అప్పట్లోనే ఇతడికి కొందరితో స్నేహం ఏర్పడి, దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో 2016లో అతడికి భవానీనగర్‌ రౌడీషీటర్‌ మహ్మద్‌ మాజిద్‌తో గొడవ జరిగింది. ఈ ఘటనలో మోసిన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ పరిణామంతో కంగుతిన్న అతడి కుటుంబసభ్యులు అతడిని ఖతర్‌కు పంపారు.

ఇటీవల నగరానికి తిరిగివచ్చిన మోసిన్‌  మళ్ళీ ఖతర్‌ వెళ్ళకుండా పాత పం«థాను అనుసరిస్తున్నాడు. రాత్రంతా స్నేహితులతో కలిసి తిరుగుతూ జల్సాలు చేసేవాడు. ఖర్చులు పెరిగిపోవడంతో అందుకు అవసరమైన డబ్బు కోసం నేరాలు చేయాలని భావించాడు. శుక్రవారం సాయంత్రం తన  స్నేహితుడి బైక్‌ తీసుకున్న అతను  రాత్రంతా రోడ్లపై తిరుగుతూనే ఉన్నాడు. శనివారం తెల్లవారుజామున మలక్‌పేట, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో వరుసపెట్టి పంజా విసిరాడు. ఒంటరిగా సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడిచి వెళుతున్న వారిని టార్గెట్‌గా చేసుకుని కేవలం గంట వ్యవధిలో మూడు స్నాచింగ్స్‌కు పాల్పడ్డాడు. దీనిపై ఆయా ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. నిందితుడిని పట్టుకోవడానికి దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, కేఎన్‌ ప్రసాద్‌వర్మ, మహ్మద్‌ థక్రుద్దీన్, వి.నరేందర్‌ రంగంలోకి దిగారు. ఘటనాస్థలాలతో పాటు పరిసరాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. దీంతో పాటు సాకేంతికంగా ముందుకు వెళ్ళిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ మోసిన్‌ను గుర్తించారు. సోమవారం అతడిని పట్టుకుని మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం చోరీ సొత్తుతో సహా నిందితుడిని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా