అక్కడ చోరీ ...ఇక్కడ విక్రయం!

15 Oct, 2019 11:17 IST|Sakshi

 అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్స్‌ స్నాచింగ్‌ ముఠా హల్‌చల్‌

బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో ఫోన్ల చోరీ

‘ఫ్లాష్‌’ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయం

పది మందిని పట్టుకున్న బెంగళూరు పోలీసులు

నిందితుల్లో నగరానికి చెందిన వ్యాపారి అమీర్‌ఖాన్‌

వ్యవస్థీకృతంగా దందా

స్నాచర్‌... రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న, ద్విచక్ర వాహనం డ్రైవ్‌ చేస్తున్న వారిలో సెల్‌ఫోన్‌ మాట్లాడే వారిని టార్గెట్‌ చేసి దాన్ని లాక్కెళతాడు.

కలెక్టర్‌... ఓ ప్రాంతంలో నేరం చేసిన తర్వాత మరో చోటుకు వెళ్లేప్పుడు మధ్యలో పోలీసుల సోదాలు జరిగితే చిక్కకుండా చోరుడి నుంచి ఫోన్లు కలెక్ట్‌ చేసుకుంటాడు.

కొరియర్‌... ఓ రోజు/ఓ దఫా చోరీ చేసిన ఫోన్లను తీసుకుని ఎవరి కంటా పడకుండా, తనిఖీల్లో చిక్కకుండా హైదరాబాద్‌కు తరలిస్తాడు.

రిసీవర్‌... బెంగళూరు నుంచి వచ్చే ఈ ఫోన్లను తీసుకుని, ‘ఫ్లాష్‌’ చేయడం ద్వారా దాని ఐఎంఈఐ నంబర్‌ మార్చేసి మార్కెట్‌లో అమ్మేస్తుంటాడు. 

సాక్షి, హైదరాబాద్‌: ఈ పంథాలో వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్న ఘరానా అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ నెల మొదటి వారంలో బెంగళూరు సెంట్రల్‌ డివిజన్‌ పోలీసులు అరెస్టు చేసిన పది మందిలో హైదరాబాద్‌కు చెందిన సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్ల వ్యాపారి అమీర్‌ఖాన్‌ సైతం ఉన్నాడు. బెంగళూరుతో పాటు నగరంలోనూ జరిగిన ఈ అరెస్టుల పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న ఈ ముఠా ఇప్పటి వరకు బెంగళూరులోని వివిధ ప్రాంతాల నుంచి పది వేల సెల్‌ఫోన్లు తస్కరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ తస్కరించిన ఫోన్లలో అత్యధికం హైదరాబాద్‌లోని సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లలోనే విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రికవరీ చేసిన వాటిలోనూ ఎక్కువ హైదరాబాద్‌లో స్వాధీనం చేసుకున్నవే కావడం గమనార్హం. 

తొలినాళ్లలో అక్కడే అమ్మినా...
బెంగళూరులోని జేజే నగర్‌కు చెందిన జేడీ(ఎస్‌) నాయకుడు ఆరిఫ్‌ ఖాన్‌ ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడి నేతృత్వంలో బెంగళూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఖిజర్‌ పాషా, అస్లం, ఆసిఫ్‌ ఖాన్, సయ్యద్‌ అక్బర్, నవాజ్‌ షరీఫ్, ఇతడి సోదరుడు అఫ్జల్‌ షరీఫ్, ఖలీమ్, సల్మాన్, జమీర్‌గా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ చోరీ చేసిన ఫోన్లను తొలినాళ్ళల్లో ఆరిఫ్‌ ఖాన్‌ బెంగళూరులోని సండే బజార్, బర్మా బజార్‌ ప్రాంతాల్లో విక్రయించేవాడు. దీనిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీంతో తమ పంథా మార్చాలని నిర్ణయించుకున్న ఆరిఫ్‌ ఖాన్‌ రాష్ట్రం బయటకు తరలించి విక్రయించడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి అమీర్‌ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. 

సుదీర్ఘ ఆపరేషన్‌.....
విచారణలో నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు ఫోన్లను తరలించే బాధ్యతల్ని సూత్రధారి ఆరిఫ్‌ ఖాన్‌ పర్యవేక్షిస్తున్నాడు. దీంతో ఇతడిని పట్టుకున్న తర్వాత అమీర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రత్యేక  బృందం అతడిని అరెస్టు చేసి కొన్ని సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుంది. విచారణ నేపథ్యంలో మిగిలిన ఇద్దరి వ్యాపారుల పేర్లు చెప్పాడు. వారిని విచారిచగా సదరు హ్యాండ్‌సెట్లు చోరీకి సంబంధించినవి అనే విషయం వీరికి తెలియదని వెల్లడైంది. దీంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న బృందం అమీర్‌ను బెంగళూరు తరలించింది. ఈ గ్యాంగ్‌కు చెందిన పది మంది నుంచి  12 యాపిల్, 81 శామ్‌సంగ్, 82 ఎంఐతో పాటు 563  ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.3 కోట్ల విలువైన వీటిలో అత్యధికం హైఎండ్‌ ఫోన్లే కావడం గమనార్హం. ఈ అంతర్రాష్ట్ర ముఠా కొన్ని ఫోన్లను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోనూ విక్రయించినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు.  

‘ఫ్లాష్‌’ చేసి మార్కెట్‌లో విక్రయిస్తూ...
నగరంలో సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్ల వ్యాపారం చేస్తున్న అమీర్‌ ఖాన్‌ మరో ఇద్దరు వ్యాపారులకు హోల్‌సేల్‌గా సరఫరా చేస్తుండేవాడు. అయితే వారితో తాను వీటిని మార్కెట్‌ నుంచే ఖరీదు చేశానని చెప్పేవాడు. బెంగళూరు నుంచి కొరియర్‌ ద్వారా అందుకున్న వాటిని ముందు కొన్ని రకాలైన సాఫ్ట్‌వేర్స్‌ వినియోగించి ‘ఫ్లాష్‌’ చేసేవాడు. ఇలా చేయడంతో పాటు ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిఫికేషన్‌ (ఐఎంఈఐ) నంబర్‌ను క్లోన్‌ చేసేవాడు. ఆపై కొత్త ఐఎంఈఐ నెంబర్‌తో సిద్ధమైన ఫోన్‌కు తక్కువ ధరకు విక్రయించేవాడు. కొన్ని హైఎండ్‌ ఫోన్లను మిగిలిన ఇద్దరు వ్యాపారులకు ఇచ్చి అమ్మించేవాడు. కొన్నాళ్ళుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని బెంగళూరు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సాంకేతికంగా దర్యాప్తు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా రెండు నెలల క్రితం ఖిజర్‌ పాషా, అస్లం వారికి చిక్కారు. 

మరిన్ని వార్తలు