ఫ్రిజ్‌లో పాము

14 Jun, 2018 12:40 IST|Sakshi
  ఫ్రిజ్‌ నుంచి పాము లాగుతున్న దృశ్యం  

బయటకు తీసిన స్నేక్‌ హెల్ప్‌లైన్‌

భువనేశ్వర్‌ : నగర వాసులు ఎక్కడ లేని కష్టాల్ని ఎదుర్కోవలసి వస్తోంది. క్రిములు, కీటకాలు, పాములు వగైరా భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. మరో వైపు జబ్బులు, జ్వరాలతో మం చం పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు నగర శివారు చందకా అభయారణ్యం పరిసర ప్రాంత ఇళ్లలోకి అంతు చిక్కని క్రిమి, కీటకాలు గుంపులు గుంపులుగా చేరి వేధించాయి.

అంతకు ముందు ఏసీ మెషీన్‌ నుంచి నాగుపాము బయటపడింది. తిరిగి ఇటువంటి సంఘటన తాజా గా వెలుగు చూసింది. స్థానిక శైల శ్రీ విహార్‌ ప్రాంతంలో ఒకరి ఇంటిలో పాము చొరబడి ఫ్రిజ్‌లో తలదాచుకుంది. జరజరా ఇంటిలోకి చొరబడిన పామును చూసి ఇంటిల్లపాదికి చెమటలు పట్టాయి. ఇంతలో చూస్తుండగానే పాము ఫ్రిజ్‌లోకి ప్రవేశించింది.

వెనుక భాగం కంప్రెషర్‌ చాటున ఇరుక్కుని బుసలు కొట్టింది. ప్రాణ భయంతో కుటుంబీకులు స్నేక్‌ హెల్ప్‌ లైన్‌కు సమాచారం తక్షణమే చేరవేశారు. ఆ బృందం వచ్చి పామును బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

చివరికి మత్తు మందు ప్రయోగించి పాము సొమ్మసిల్లేలా జేసి బయటకు లాగారు. పాము 4 అడుగుల పొడవు ఉన్నట్లు ఈ బృందం ప్రకటించింది. అనంతరం ఈ పామును నగరం శివారు అడవుల్లో విడిచి పెట్టారు.

మరిన్ని వార్తలు