ఘరానా స్నాచర్‌ ఫైజల్‌ దొరికాడు

22 Aug, 2019 11:39 IST|Sakshi

సెల్‌ఫోన్లు, క్యాష్‌ బ్యాగులే టార్గెట్‌

ఇప్పటికే అతడిపై 21 కేసులు

రెండుసార్లు పీడీ యాక్ట్‌ సైతం ప్రయోగం

సాక్షి, సిటీబ్యూరో: ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని, అర్ధరాత్రి వేళల్లో సంచరిస్తూ, ఒంటరిగా కనిపించిన వారి నుంచి సెల్‌ఫోన్లు, క్యాష్‌ బ్యాగ్‌లు లాక్కుపోయే ఘరానా స్నాచర్‌ మహ్మద్‌ ఫైజల్‌ను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఇతడిపై మొత్తం 21 కేసులు నమోదై ఉన్నాయని, రెండుసార్లు పీడీ యాక్ట్‌ ప్రయోగించారని డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. ఈ అరెస్టుతో రెండు కమిషనరేట్లలోని మూడు కేసులు కొలిక్కి వచ్చినట్లు పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ పరిధిలోని హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఫైజల్‌ ఏడో తరగతితో చదువుకు స్వస్థి చెప్పి ఆటోడ్రైవర్‌గా మారాడు. ఆపై దురలవాట్లకు బానిసైన అతను తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా కొందరితో జట్టు కట్టాడు. వారితో కలిసి అర్ధరాత్రి వేళల్లో బైక్‌లపై తిరుగుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుంటారు. అదును చూసుకుని ఆ వ్యక్తి వద్ద ఉన్న ఖరీదైన సెల్‌ఫోన్‌ లేదా క్యాష్‌బ్యాగ్‌ లాక్కుని పరారయ్యేవారు. ఈ పంథాలో గతంలో వివిధ ఠాణాల పరిధిలో నేరాలు చేశారు. ఫైజల్‌పై 14 స్నాచింగ్, ఒక చోరీ, మరో చోరీ యత్నంతో పాటు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి.

ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసులు 2015, 2017లో పీడీ యాక్ట్‌ ప్రయోగించి ఏడాది చొప్పున జైలులో ఉంచారు. గత ఏడాది జైలు నుంచి బయటకు వచ్చిన ఫైజల్‌ తన పంథా మార్చుకోలేదు. రాజేంద్రనగర్‌లో చోరీ, చంద్రాయణగుట్ట పరిధిలో హత్య కేసుల్లో నిందితుడిగా మారాడు. ఇటీవల హాజీ అనే మరో నిందితుడితో కలిసి నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ ఏడాది జూలై 12న బోయిన్‌పల్లి ప్రాంతంలో సుమన్‌ కళ్యాణ్‌ నుంచి సెల్‌ఫోన్‌ ఎత్తుకుపోయారు. గత నెల 10న మలక్‌పేట, కూకట్‌పల్లిల్లో రెండు నేరాలు చేశారు. ఆరోజు రాత్రి  కేపీహెచ్‌బీ ఏసీ బస్టాప్‌ వద్ద అజీమ్‌ అనే వ్యక్తి నుంచి ఫోన్, అర్ధరాత్రి ఒంటి గంటకు దిల్‌సుఖ్‌నగర్‌లో నాగేంద్రకుమార్‌ నుంచి మరో ఫోన్‌ లాక్కెళ్లారు. బోయిన్‌పల్లిలో నమోదైన కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఘటనాస్థలితో పాటు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించారు. ఇందులో దొరికిన ఆధారాలతో పాటు సాంకేతికంగా ముందుకు వెళ్ళి ఫైజల్‌ నిందితుడిగా తేల్చా రు. దీంతో అతడిని పట్టుకోవడానికి ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డిలతో రంగంలోకి దిగారు. బుధవారం తన వాహనంలో వెళ్తున్న ఫైజల్‌ను ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి ఓ కత్తితో పాటు చోరీ సొత్తు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న హాజీ కోసం గాలిస్తున్నారు. ఫైజల్‌పై మూడోసారి పీడీ యాక్ట్‌ ప్రయోగించడానికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు