ఈ సోషల్‌ తీవ్రవాదం.. టీడీపీ ఉన్మాదం!

24 Jun, 2020 10:14 IST|Sakshi
లోపలికి రానీయకపోవడంతో సీఐడీ ప్రాంతీయ కార్యాలయం బయట వేచి ఉన్న గంటా, తదితరులు

వైఎస్సార్‌ సీపీ ముఖ్యనేతలపై కల్పిత కథనాల కుట్రలో ’ పచ్చ’ ముద్ర

వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో అసత్య పోస్టులు

తప్పుడు కథనాలను వ్యాప్తి చేసిన నలంద కిశోర్‌

ఆయన టీడీపీ సానుభూతిపరుడు, మాజీ మంత్రి గంటాకు సన్నిహితుడు

ప్రాథమిక విచారణలో నిర్ధారించిన సీఐడీ

అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని అరెస్టు

ల్యాండ్‌ మాఫియాలో కిషోర్‌ హస్తంపై లోతుగా విచారణ

టీడీపీ పెద్దల హస్తంపై కూడా ఆరా

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను మేనేజ్‌ చేయడం.. వ్యక్తుల అవసరానికి వాడుకొని కరివేపాకు చందంగా తీసిపారేయడం టీడీపీ అధినేతతో సహా ఆ పార్టీ పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య అనేది ఎన్నోసార్లు వ్లెలడైన వాస్తవం.అధికారాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు తెగబడిన ఆ పార్టీ పెద్దలు.. అధికారం కోల్పోయాక సామాజిక మాధ్యమాల వేదికగా మరింత దిగజారిపోతున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, ఆ పార్టీ, ప్రభుత్వ పెద్దలపై అశ్లీ, అసభ్యక సమాచారం, చిత్రాలతో అసత్యాలను వండివార్చి సమాజం మీదికి వదులుతున్న తీరు.. ప్రభుత్వంపై బురదజల్లుతున్న తీరు.. జగుప్స కలిగిస్తోంది.సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలను విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్న వ్యక్తులను సీఐడీ అరెస్టు చేయడంతో టీడీపీ బండారం బట్టబయలవుతోంది.సీఐడీ సోషల్‌ మీడియా తీగ లాగుతుంటే.. టీడీపీ డొంక కదులుతుండటం కలకలం రేపుతోంది.(గంటా గ్యాంగ్‌ హల్‌చల్‌)

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికారంలో ఉన్న ఐదేళ్లూ భూకుంభకోణాలు, దందాలతో విశాఖపట్నాన్ని చెరబట్టిన తెలుగుదేశం నాయకులు .. అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురదజల్లడం,  వైఎస్సార్‌సీపీ నేతల వ్యక్తిత్వాలపై విషం చిమ్మడం, వారి గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం.. వంటి కుట్రలను సీఐడీ బట్టబయలు చేసింది.

విశాఖ కేంద్రంగా..
గత కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోతున్న పచ్చశ్రేణుల తీగ లాగితే ప్రతిపక్ష పెద్దల డొంక కదులుతుండటం ఇప్పుడు విశాఖలో కలకలం రేపుతోంది. విశాఖలో భూకబ్జాలకు అడ్డుకుట్ట వేస్తూ.. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటకు తీస్తున్న ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై కుట్రపూరిత కథనాల సృష్టికర్తలను సీఐడీ అరెస్టు చేయడంతో దీని వెనుకనున్న ప్రతిపక్ష నేతల ముసుగు తొలగుతోంది. ఏడాది కాలంగా సోషల్‌ మీడియా కుట్రపూరితకథనాలు వండివార్చుతున్న టీడీపీ సానుభూతిపరులు.. ఇటీవల మరింత రెచ్చిపోయి విశాఖ కేంద్రంగా ముఖ్యనేతలపై ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో అశ్లీల, అసభ్యకర పోస్టులతో విష ప్రచారాన్ని పరాకాష్టకు చేర్చారు. మొదట్లో పెద్దగా పట్టించుకోని వైఎస్సార్‌సీపీ నేతలు ఈ దారుణ  విష ప్రచారాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించి సీఐడీ దృష్టికి తీసుకువెళ్లారు. రంగంలోకి దిగిన  సీఐడీ  కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై లోతైన విచారణ చేపట్టి  పూర్తి ఆధారాలు సేకరించింది. విశాఖ కేంద్రంగా ఈ తప్పుడు కథనాలను, విష ప్రచారాలను అందరికీ చేరవేస్తున్న వ్యక్తి టీడీపీ క్రియాశీల కార్యకర్త అయిన నలంద కిశోర్‌గా గుర్తించింది. మూడురోజుల కిందట అతన్ని తమ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపి పంపేసిన సీఐడీ అధికారులు.. ఆధారాల నిగ్గు తేలడంతో మంగళవారం తెల్లవారుజామున కిశోర్‌ను అరెస్టు చేశారు.

ఇంకా ఎవరెవరున్నారు..?
ఈ అసత్య పోస్టులను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న నలంద కిశోర్‌ వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై కూడా సీఐడీ లోతైన దర్యాప్తు చేపట్టింది. అసత్య కథనాల సృష్టికర్తలు, వారి వెనుక ఉన్న పెద్దలు, వాటిని షేర్‌ చేస్తున్న వారి వివరాలపై ఆరా తీసింది. ఫేస్‌బుక్‌లోనే కాకుండా, టీడీపీకి మద్దతు పలికే సోషల్‌ మీడియా మిషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ద్వారా విదేశాలకు సైతం షేర్‌ చేస్తున్న విషయాన్ని గుర్తించింది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే.. ప్రభుత్వ పెద్దల ప్రతిష్టను మంటగలిపే కథనాలను షేర్‌ చేస్తుండడం వెనుక భారీ కుట్ర ఉందనేదానికి అవసరమైన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పెద్దలపై తప్పుడు కథనాలు సృష్టించడం ద్వారా ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించడమే ధ్యేయంగా ఈ కుట్రకు తెర తశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల అదుపులో నలంద కిశోర్‌ 
ల్యాండ్‌ మాఫియా హస్తం
ఈ కుట్ర వెనుక రాజకీయ కారణాలతో పాటు ల్యాండ్‌ మాఫియా హస్తం ఉందన్న కోణంలో కూడా సీఐడీ  దర్యాప్తు సాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. గత ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడిన విషయాన్ని అప్పట్లో సహచర అమాత్యుడే స్వయంగా ఆరోపణలు చేశాడు. దీనిపై గత ప్రభుత్వం సిట్‌ విచారణ జరిపించినప్పటికీ.. అందులో వాస్తవాలను, అక్రమాలకు పాల్పడిన వారి వివరాలను, సిట్‌ నివేదికలోని అంశాలను బయట పెట్టలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణకు మరో సిట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఎక్కడ వెలుగులోకి వస్తుందోనన్న భయంతో.. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై తప్పుడు కథనాలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌ చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా కుట్ర పన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి,. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కూడా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వంపైన, ప్రభుత్వ పెద్దలపైన తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారన్న విషయంపై సీఐడీ ఫోకస్‌ చేసింది.

భూదందాల్లో కిశోర్‌ పాత్రపై ఆరా
విశాఖలో జరిగిన భూదందాల్లో నలంద కిశోర్‌ పాత్రపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంశాలను వారు గుర్తించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ముఖ్యంగా దసపల్లా భూముల వ్యవహారంలో తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించడంలో కిశోర్‌ పాత్ర ఉందని సీఐడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పెద్దల భూ వ్యవహారాల్లో కిశోర్‌ క్రియాశీలకంగా వ్యవహరించారన్న విషయాన్ని సీఐడీ పూర్తి ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

టీడీపీ సానుభూతి పరుడునలంద కిశోర్‌ అరెస్ట్‌
సాక్షి, విశాఖపట్నం:  ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో తప్పుడు కథనాలను షేర్‌ చేసిన టీడీపీ సానుభూతిపరుడు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు యలమర్తి నలంద కిశోర్‌ను సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లతో పాటు టీడీపీ అనుకూల సోషల్‌ మీడియాలో కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్న విషయంపై నలంద కిశోర్‌కు సీఐడీ అధికారులు మూడు రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. దీనిపై మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సంపత్‌ వినాయక ఆలయం వెనుక ఉన్న ఆయన నివాసంలో సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడ నుంచి ఆరిలోవ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చి ఐపీసీ సెక్షన్‌ 505బీ, 120బీ కింద కేసు  నమోదుచేసి  విచారించారు.  విచారణ సమయంలో సీఐడీ అధికారులు కిశోర్‌ తరఫు న్యాయవాది సుమన్‌ను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. ఆయన సమక్షంలోనే నిందితుడ్ని కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు.  

మరిన్ని వార్తలు