అసలేం జరిగింది..?

27 Jun, 2020 11:30 IST|Sakshi
‘జస్టిస్‌ ఫర్‌.. ’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌

 యువతి మృతిపై అనేక అనుమానాలు

కొనసాగుతున్న పోలీస్‌ విచారణ

కొత్తగూడెంఅర్బన్‌: రైల్వే పట్టాలపై ఒంటిపై అరకొర దుస్తులతో.. శరీరమంతా గాయాలతో పడి ఉన్న మృతదేహం. పట్టాలపై పడి ఉన్న యువతిది ఆత్మహత్యనా.. లేక ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారా.. ? ఇదే ఇప్పుడు భద్రాద్రి జిల్లా ప్రజల్లో నెలకొన్న సందేహం. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం త్రీఇంక్లైన్‌ పంచాయతీ బేరియం తండా సమీపంలోని గూడ్స్‌ రైల్వేట్రాక్‌పై బుధవారం తెల్లవారుజామున ఓ యువతి (17) మృతదేహం పడి ఉంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్లిన కొందరికి ఒంటిపై తీవ్ర గాయాలతో, దుస్తులు లేకుండా కన్పించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఎవరు అనేదానిపై టూటౌన్‌ పోలీసులు విచారణ జరపగా కొత్తగూడెంలోని గంగబిషన్‌ బస్తీకి చెందిన యువతిగా గుర్తించారు. రైల్వే పట్టాలపై మృతదేహం లభించడంతో ఆ కేసును పోలీసులు రైల్వే జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ మృతిపై స్థానికులు, జిల్లా ప్రజ లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంగబిషన్‌బస్తీకి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు. అందులో ఒకరు ఈ యువతి (17). మృతదేహం లభించడానికి ముందురోజు అర్ధరాత్రి ఆమె కన్పించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.  మృతిపై అనుమానాలు ఉండటంతో పోస్టుమార్టం కూడా రెండుసార్లు నిర్వహించడం గమనార్హం.(సెల్ఫీ వీడియో తీసి యువకుడు ఆత్మహత్య )

‘జస్టిస్‌ ఫర్‌.. ’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌
మృతిపై అనుమానాలు..
మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువతి మృతి చెందడానికి ముందురోజు ఆమె ఇంట్లోకి అదే ప్రాంతానికి చెందిన సందీప్‌ అనే యువకుడు గోడదూకి వెళ్లాడు. ఇది చూసిన ఆమె తల్లిదండ్రులు సందీప్‌ను పట్టుకుని, అతని తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లి మందలించారు. అయితే వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి సదరు యువతి కన్పించలేదు. దీంతో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ తెల్లవారుజామున రైల్వే పట్టాలపై మృతదేహం కన్పించిందని స్థానికుల ద్వారా తెలుసుకున్న వారు వెళ్లి చూసి తమ కూతురేనని నిర్ధారించారు. ఇదిలా ఉండగా మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడు తన కోసం ఇంట్లోకి గోడదూకి వెళ్లడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుందా..? లేక ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారా అని అను మానం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఆత్మహత్య చేసుకునేందుకే రైల్వే పట్టాలపైకి వెళ్తే.. తన ఇంటికి సుమారు నాలుగైదు కిలో మీటర్ల దూరంలో ఉన్న బేరియంతండా వరకు ఎందుకు వెళ్లినట్లు అని సందేహిస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలు, ఒంటిపై దుస్తులు కొద్దిగానే ఉండటంతో ఆత్మహత్య చేసుకునే క్రమంలో రైలు ఢీకొన్నప్పుడు కొద్దిదూరం కొట్టుకుని పోయిన క్రమంలో అలా జరిగి ఉండవచ్చునని కొందరు భావిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో‘జస్టిస్‌ ఫర్‌.. ’ పోస్టులు
ఇదిలా ఉండగా యువతిని అత్యాచారం చేసి హత్య చేశారని, న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ‘జస్టిస్‌ ఫర్‌..’ పోస్టులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే ఆమె ఫైల్‌ ఫొటోలతో పాటు, రైల్వే పట్టాలపై మృతదేహం పడి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..
మృతి సంఘటనపై పోలీసులు, రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గత మూడు రోజులుగా ఐపీఎస్‌ అధికారి వినీత్‌ ఆధ్వర్యంలో రైల్వే జీఆర్‌పీ, టూ టౌన్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు అది ఆత్మహత్యనా, లేక అత్యాచారం చేసి హత్య చేశారా అనే విషయాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే బయటపెడతామని పోలీసులు చెప్తున్నారు. ఘటన జరిగిన రోజు సందీప్‌ కుటుంబసభ్యులతో సహా ఇంటి నుంచి వెళ్లిపోగా, ప్రస్తుతం ఆ యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు