పాప రేప్‌పై సోషల్‌ మీడియా గగ్గోలు

8 Jun, 2019 16:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మూడేళ్ల పాపను రేప్‌ చేసి హత్య చేశారు. ఆ పాప రెండు కనుగుడ్లను పీకేసారు. ఓ చేయి విరిచేశారు. శరీరంపై యాసిడ్‌ పోశారు. ఆ తర్వాత కుక్కలు పీక్కుతినేలా చెత్త కుండీలో పడేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టింది జాహిద్, అస్లాం అనే యువకులు’.. ఈ వార్త చదవగానే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. ఆ వెంటనే రక్తం సలసలా కాగిపోతుంది. ఆ పాశవిక నేరస్థులు కళ్లముందు కనిపిస్తే పెట్రోలు పోసి తగుల బెట్టాలనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్త ఇది.
 
‘రేప్‌లకు మతం లేదనే వారు నేడెక్కడికి పోయారు? కశ్మీర్‌లోని కథువాలో ఎనిమేదేళ్ల బాలికపై హిందూ యువకులు సామూహిక అత్యాచారం జరిపారంటూ గగ్గోలు ఎత్తిన వారు నేడెక్కడా ?’ అంటూ వరుసగా వెలువడుతున్న ట్వీట్లతో నేడు అలీగఢ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చేతిలో నేరాన్ని తెలియజేసే బోర్డు పట్టుకున్న ఫొటోతో మాధుర్‌ అనే వ్యక్తి ఈ నెల ఐదవ తేదీన చేసిన ట్వీట్‌ మొట్టమొదట అలజడి సృష్టించింది. ఇప్పుడు దానికి అనుగుణంగా వరుసపెట్టి ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. ఇంత దారుణ సంఘటనలో నిజం కొంతే. 

అసలేం జరిగిందీ...?
జూన్‌ రెండవ తేదీన చీర కొంగులో చుట్టిన రెండున్నర ఏళ్ల పాప మతృదేహం ఓ ఖాళీ స్థలంలో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. అలీగఢ్‌ పోలీసులు అక్కడికి వెళ్లి పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. అనంతరం రిపోర్టు కూడా వచ్చింది. పాపపై ఎలాంటి రేప్‌ జరగలేదని, గుడ్లు పీకేయడం, చేయి విరిచేయడం లాంటి దారణాలు కూడా జరగలేదని, గుంతు పిసకడం వల్ల ఊపిరాడక పాప మరణించిందని అలీగఢ్‌ సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆకాష్‌ కుల్‌హరి మీడియా ముఖంగా తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగా పాపను చంపేస్తామని బెదిరించిన హంతకులు అన్యాయంగా పాపను పొట్టనపెట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో జాహిద్, అస్లాం అనే యువకులను అరెస్ట్‌ చేశామని చెప్పారు. 

మరిన్ని వార్తలు