చెంపదెబ్బ కొట్టాడనే...

4 May, 2019 07:09 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్య కేసులో వీడిన మిస్టరీ

స్నేహితులే నిందితులు

పాత కక్షల నేపథ్యంలోనే హత్య

మైనర్‌తో సహా ఐదుగురి అరెస్ట్‌

నేరేడ్‌మెట్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జాషువా రోహిత్‌ శామ్యూల్‌ అలియాస్‌ బిట్టు హత్య కేసు మిస్టరీ వీడింది. గతంలో జరిగిన విందులో తనను చెంప దెబ్బ కొట్టాడనే కారణంతో అతడిపై పగ పెంచుకున్న అతడి స్నేహితుడే మరికొందరితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు వెల్లడైంది. రెండు రోజుల్లోనే కేసును చేధించిన మల్కాజిగిరి పోలీసులు నలుగురు నిందితులతోపాటు, ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ సందీప్, సీఐ మన్మోహన్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. తార్నాక(విజయపురి కాలనీ)లోని జయనివాస్‌ అపార్ట్‌మెంట్‌లో  ఉంటున్న నజ్రీనారావు కుమారుడు రోహిత్‌ శామ్యూల్‌(28) కాల్‌ సెంటర్‌లో చేసేవాడు. ఈస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన వెబ్‌ డిజైనర్‌ క్యాస్పర్‌ తేజ్‌ ఈమండి, పద్మారావునగర్‌కు చెందిన మహ్మద్‌ ఇస్లాం అతడి స్నేహితులు. వారి ద్వారా పద్మారావునగర్‌కు చెందిన పుల్లనూర్‌ బాబు, మహ్మద్‌ ఇర్ఫాన్, మహ్మద్‌ ఇస్మాయిల్‌ తో పరిచయం ఏర్పడింది. రోహిత్‌ శామ్యూల్, క్యాస్పర్‌ తేజ్, ఇస్మాయిల్‌ తరచూ కలిసి మద్యం తాగేవారు. అర్థరాత్రి దాటిన తరువాత బయటకు వెళ్లి మద్యం సేవించి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేవారు. 

8 నెలల క్రితం రోహిత్‌ శామ్యూల్‌ ఇంట్లో క్యాస్పర్‌ తేజ్‌తోపాటు మరి కొందరు స్నేహితులు కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా క్యాస్పర్‌ తేజ్‌ రోహిత్‌ శామ్యూల్‌ స్నేహితులతో గొడవపడటంతో ఆగ్రహానికి లోనైన రోహిత్‌ అతడిని వారించి  చెంప దెబ్బ కొట్టాడు. దీంతో క్యాస్పర్‌ తేజ్‌ అప్పటి నుంచి రోహిత్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయాన్ని అతను మహ్మద్‌ ఇస్లాం, బాబులకు చెప్పడంతో అందరూ కలిసి రోహిత్‌ను అంతమొందించేందుకు పథకం పన్నారు. ఇందులో భాగంగా రోహిత్‌తో స్నేహం కొనసాగిస్తున్న క్యాస్పర్‌ తేజ్‌ ఏప్రిల్‌ 30న అతడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం పక్కాగా అమలు చేసేందుకు ఇర్ఫాన్‌తోపాటు మరో మైనర్‌ సహకారం తీసుకున్నారు. గత నెల 30న రాత్రి క్యాస్పర్‌ తేజ్‌ రోహిత్‌కు ఫోన్‌ చేసి స్నేహితులందరం పార్టీ చేసుకుంటున్నామని రావాలని కోరాడు.  అందుకు అతను నిరాకరించడంతో తెల్లవారే లోగా తిరిగి రావచ్చునని బలవంతం చేయడంతో రోహిత్‌ అంగీకరించాడు.

అతడిని బైక్‌పై ఇసుక బావి వెనుక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం పథకం ప్రకారం  రోహిత్‌కు ఎక్కువగా మద్యం తాగించారు. ఈ సందర్బంగా మహ్మద్‌ ఇస్లాంæ గతంలో క్యాస్పర్‌తేజ్‌తో జరిగిన గొడవ విషయాన్ని చర్చకు తెస్తూ వయసులో పెద్దవాడైన క్యాస్పర్‌తేజ్‌ను ఎందుకు కొట్టావని రోహిత్‌ను నిలదీయడంతో  ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఇస్లాం  రోహిత్‌ తలపై మద్యం సీసాతో బాదడంతో అతను కింద పడ్డాడు. అనంతరం క్యాప్సర్‌ తేజ్, బాబు, ఇర్ఫాన్‌ రోహిత్‌ను గట్టిగా పట్టుకోగా ఇస్లాం, మరో మైనర్‌ బండరాళ్లతో మోది అతడిని దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. మే 1వ తేదీ ఉదయం రోహిత్‌ తల్లి నజ్రీనా రావు అతడికి ఫోన్‌ చేయగా ఫోన్‌ ఎత్తిన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ ఎత్తి గుర్తు తెలియని వ్యక్తులు నీ కుమారుడిని హత్య చేసినట్లు సమాచారం అందించాడు. నజ్రీనారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుని కాల్‌డేటాతోపాటు సీసీటీవీ పుటేజీల ఆధారంగా ఆధారాలు సేకరించారు. నిందితులు ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ తెలిపారు. రెండు రోజుల్లోనే కేసు చేధించిన మల్కాజిగిరి సీఐ మన్మోహన్‌తోపాటు ఎస్‌ఓటీ పోలీసులను డీసీపీ అభినందించారు.  

మరిన్ని వార్తలు