భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

15 Oct, 2019 11:07 IST|Sakshi
రఘురాం మృతదేహం

బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్న మృతుడు

గచ్చిబౌలి: బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బహుళ అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్‌ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన పాలపర్తి రఘురాం(35), భార్య సుజాతతో కలిసి చందానగర్‌లో ఉంటున్నాడు. రఘురాం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్‌లో టీం లీడర్‌గా పని చేస్తుండగా అదే కంపెనీలో  సుజాత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. సోమవారం ఉదయం ఇద్దరు కలిసి క్యాబ్‌లో డ్యూటీకి వెళ్లారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కంపెనీ నుంచి బయటికి వచ్చిన వెళ్లిన రఘురాం నడుచుకుంటూ 500 మీటర్ల దూరంలో విప్రో జంక్షన్‌లోని మంత్రి అపార్ట్‌మెంట్స్‌ 24 అంతస్తు పైకి వెళ్లి కిందుకు దూకాడు. మొదటి అంతస్తుకు ఎక్కినట్లుగా సీసీ కెమెరాలో రికార్డయినా 24వ అంతస్తులో ఉన్న సీసీ కెమెరాలో రఘురాం కనిపించలేదని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడికి బైపోలార్‌ డిజార్డర్‌
మృతుడు రఘురాం చిన్నతనం నుంచి బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల క్రితం కిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. దీనికితోడు అతడి తండ్రి, నాయనమ్మ అనారోగ్యంతో మంచం పట్టడంతో అతను మానసికంగా మరింత ఒత్తికి లోనైట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు