సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

13 Nov, 2019 10:10 IST|Sakshi
కరణ్‌కుమార్‌ (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీరా, హైదర్‌బస్తీ ప్రాంతానికి చెందిన జయకుమార్‌ కుమారుడు కరణ్‌కుమార్‌(29) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. గత కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న అతను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొన్నాళ్లుగా అతను ఇంటి నుంచే ఆఫీసు పని చేసుకునేవాడు. మంగళవారం ఉదయం పెంట్‌హౌస్‌లో పని చేసుకుంటున్న కరణ్‌కుమార్‌ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

భార్య కాపురానికి రావడం లేదని..
మేడ్చల్‌: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యనారయణ(40) కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి మేడ్చల్‌లో నివాసముంటూ స్ధానిక పారిశ్రామిక వాడలోని గ్రిప్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా అతడి భార్య రామకృష్ణ 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా తిరిగి రాకపోవడంతో మనస్తాపానికిలోనైన సత్యనారయణ గత 10 రోజులుగా డ్యూటీకి వెళ్ళకుండా బయటే తిరుగుతున్నాడు. మంగళవారం సుతారిగూడలోని   కంపెనీ క్వార్టర్స్‌కు వెళ్లిన అతను ఓ భవనంలో సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన తోటి కార్మికులు యాజమాన్యానికి సమాచారం అందిచడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

భార్య పుట్టింటికి వెళ్లిందని..
భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపానికి లోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన ప్రీతమ్‌సింగ్‌(22) స్థానిక ఎల్లంపేట్‌ చౌరస్తాలోని టీసీఐ ట్రాన్స్‌ పోర్ట్‌లో పని చేస్తూ రాఘవేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య నన్సిశర్మ 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి లోనైన ప్రీతమ్‌సింగ్‌ సోమవారం రాత్రి భార్యకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె ప్రీతమ్‌తో కలిసి పని చేస్తున్న సత్యందర్‌సింగ్‌కు సమాచారం అందించింది. దీంతో అతను టీసీఐ ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని సుశీల్‌కుమార్‌కు చెప్పగా అతను ప్రీతమ్‌సింగ్‌ ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే ప్రీతమ్‌సింగ్‌  సీలింగ్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశీల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు