గుంటూరులో టీడీపీ నేత తనయుడి నిర్వాకం

6 May, 2019 11:19 IST|Sakshi

వ్యాపార లావాదేవీల వివాదంతో కుటుంబం కిడ్నాప్‌

వారం రోజుల పాటు ఓ ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు

స్థానికుల సమాచారంతో కాపాడిన పోలీసులు

సాక్షి, గుంటూరు‌: వారిద్దరూ బంధువులే. సాఫ్ట్‌వేర్‌ వ్యాపారాల్లో భాగస్వాములు కావడంతో డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. అయితే వ్యాపార లావాదేవీల్లో తేడా రావడంతో పార్టనర్‌ కుటుంబ సభ్యులను సైతం కిడ్నాప్‌ చేయడానికి కూడా వెనకాడలేదు. గుంటూరుకు చెందిన ఓ టీడీపీ నేత తనయుడి నిర్వాకం ఇదీ. సమయానికి పోలీసులు రావడంతో బాధితులు సురక్షితంగా చెర నుంచి బయటపడ్డారు. 

వారం రోజులుగా నిర్బంధించి చిత్రహింసలు..
ఒంగోలుకు చెందిన తోట నిలయ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. గుంటూరులోని గోరంట్లకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు యర్రంశెట్టి వేణుగోపాల్‌ కుమారుడు విజయ్‌తో కలిసి సాఫ్ట్‌వేర్‌ సంబంధిత వ్యాపారాలు చేస్తుంటాడు. నిలయ్, విజయ్‌ కుటుంబాలు బంధువులు కావడంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది. ఓ యూనివర్సిటీ పరిధిలో సాఫ్ట్‌వేర్‌ సంబంధిత ప్రాజెక్టులున్నట్లు ఒంగోలుకు చెందిన ఆర్‌ఎంపీ నాగేశ్వరరావు చెప్పటంతో ముగ్గురూ కలసి పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ ప్రాజెక్టులు బోగస్‌ అని తేలటంతో విజయ్‌ తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నిలయ్‌ని ఒత్తిడి చేశాడు. 

తాను కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేశానన్న నిలయ్‌ నెల రోజులపాటు అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో అతడి కోసం గాలించిన విజయ్‌ ఒంగోలులో ఉన్న నిలయ్‌తోపాటు భార్య అలేఖ్య, అత్త మామలను బలవంతంగా తరలించి గుంటూరు శివారులోని ఒక ఇంట్లో గత నెల 29వ తేదీ నుంచి నిర్బంధించాడు. వారం రోజులుగా గదిలో ఉంచి చిత్ర హింసలకు గురిచేశాడు. పసిగట్టిన స్థానికులు 100కి సమాచారం అందించటంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి బాధితులను కాపాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిండుగర్భిణి అని చూడకుండా వేధించారని అలేఖ్య పేర్కొంది. నిందితులు యర్రంశెట్టి వేణుగోపాల్, విజయ్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా