సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం

20 Mar, 2018 10:58 IST|Sakshi
 సంఘటన స్థలంలో పడి ఉన్న బైక్, శంకర్‌ మృతదేహం

పోశెట్టిగూడ వద్ద ఔటర్‌పై ఘటన

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌): అసంపూర్తిగా ఉన్న ఔటర్‌ సర్వీసు రోడ్డుపై ఉన్న ఓ గుంతలో పడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని పోశెట్టిగూడ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై అహ్మద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్‌ జిల్లా మంగపేట్‌ మండలం కమలాపూర్‌ వాసి జి.శంకర్‌(26) శంషాబాద్‌ సమీపంలో ఉన్న అమెజాన్‌ కంపెనీ గోదాంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శంషాబాద్‌లో నివాసముంటున్న ఇతను సోమవారం ఉదయం బైక్‌పై తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్‌ వస్తున్నాడు.

ఔటర్‌లోని సర్వీసు దారిగుండా హమీదుల్లానగర్‌ సమీపంలోకి రాగానే.. ఇతను తొండుపల్లి మార్గం వైపు వెళ్లకుండా నేరుగా ముందుకు వెళ్లాడు. కొద్దిదూరంలో అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్డు చివరలో గుంతలో పడిపోయాడు. బీటీ రోడ్డు చివరి నుంచి దాదాపు వంద అడుగుల దూరం వరకు బైక్‌ వేగంగా రాళ్లు, మట్టికుప్పలు దాటుకుంటూ అక్కడున్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో శంకర్‌ తలకు తీవ్రగాయాలై సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు