ఆత్మహత్యా.. ఈత రాకనా?

3 Jun, 2020 07:55 IST|Sakshi
శ్రీనివాస్‌ (ఫైల్‌), చెరువులో తేలుతున్న శ్రీనివాస్‌ మృతదేహం

చెరువులో శవమై తేలిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

కేపీహెచ్‌బీకాలనీ: హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ముళ్లకత్వ చెరువు బతుకమ్మ కుంటలో ఓ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మంగళవారం శవమై తేలాడు. స్థానికుల సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని మెట్టుగూడలో మద్దెల శ్రీనివాస్‌ (35) నివసిస్తున్నాడు. జెన్‌పాక్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 30న భార్య అలేఖ్యతో వివాదం చోటుచేసుకోగా కుటుంబ సభ్యులు   సముదాయించి గొడవ సద్దుమణిగేలా చేశారు. మరుసటి రోజు మద్దెల శ్రీనివాస్‌ తన సోదరి ఇంటికి వెళ్తున్నానంటూ బైక్‌పై బయలుదేరాడు.(కన్నబిడ్డకు పాలిచ్చేందుకు వచ్చిన)

రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో మంగళవారం శ్రీనివాస్‌ భార్య అలేఖ్య ఆందోళనకు గురై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముళ్లకత్వ చెరువులోని బతుకుమ్మ కుంటలో శ్రీనివాస్‌ శవమై తేలినట్లుగా వారు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి ఒంటిపై కేవలం అండర్‌వేర్‌ మాత్రమే ఉంది. చెరువులో దిగి ఈత రాకపోవడంతో మృతి చెందాడా? లేక కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్యాభర్తల గొడవ కారణంగానే తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మద్దెల శ్రీకాంత్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

మరిన్ని వార్తలు