కిడ్నాప్‌ కలకలం

1 Feb, 2019 10:53 IST|Sakshi
కిడ్నాప్‌నకు గురైన సాయి

ఫోన్‌లో వేధిస్తున్న యువకుడికి బుద్ధి చెప్పేందుకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పథకం

స్నేహితులను పురమాయించి బలవంతంగా తీసుకెళ్లి దాడి

స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు

గాయాలతో ‘గాంధీ’లో బాధితుడు ప్రత్యక్షం

పోలీసుల అదుపులో నిందితులు

సనత్‌నగర్‌: ఫోన్‌లో వేధిస్తున్న వ్యక్తి అంతు చూడాలనుకున్న ఓ యువతి తన స్నేహితులను ఉసిగొల్పింది. అంతే..ఆ మిత్రులు సదరు వ్యక్తిని కొట్టుకుంటూ కిడ్నాప్‌ చేసి బైక్‌పై తీసుకువెళ్లిన ఘటన సికింద్రాబాద్‌ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ సంఘటనను కళ్లారా చూసిన వారిలో ఒకరు 100కు డయల్‌ చేసి ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసును చేధించే పనిలో పడ్డారు. చివరకు కిడ్నాప్‌ చేసిన యువకులతో దెబ్బలు తిన్న ఆ వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చేరడంతో కిడ్నాప్‌ ఉదంతం కొలిక్కివచ్చింది. గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజిగిరికి చెందిన దివ్య ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రోగ్రామింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. కార్పెంటర్‌గా పనిచేసే బోరబండకు చెందిన సాయి అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆమెను ఫోన్‌లో వేధిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులు, పోలీసులకు గానీ చెప్పకుండా తానే పరిష్కరించుకోవాలని ఆమె భావించింది. ఈ నేపథ్యంలో తన మిత్రులతో కలిసి పథకం పన్నింది. అందులో భాగంగా సాయిని సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ వద్దకు పిలిపించింది.

దివ్య అతడితో మాట్లాడుతుండగా బైక్‌లపై వచ్చిన ఆమె ఐదుగురు మిత్రులు బలవంతంగా సాయిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకువెళ్లారు. తాను ఎక్కనంటూ సాయి వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా, కొడుతూ అతడి తీసుకెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న విజయ్‌ అనే వ్యక్తి 100కు డయల్‌ చేయడంతో గోపాలపురం పోలీసులు రంగంలోకి దిగి సెయింట్‌ ఆన్స్‌ కళాశాల రోడ్డులోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన బైక్‌ నంబర్‌ ఆధారంగా కేసును చేధించే పనిలో పడ్డారు. ఈలోగా ఓ యువకుడు ఒంటిపై దెబ్బలతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన పోలీసులు కిడ్నాప్‌నకు గురైన సాయిగా గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దివ్య  తనను కిడ్నాప్‌ చేయించినట్లు బాధితుడు చెపకపడంతో కేసు విచారణ చేపట్టారు. ఈ మేరకు దివ్యతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. అయితే సాయికి తెలిసిన అమ్మాయి కావడంతో ఆమె నంబర్‌ సంపాదించి ఫోన్‌ చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు నిందితులపై కిడ్నాప్‌ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దివ్యతో సహా మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు