సోలార్‌ ప్రాజెక్టులో గొడ్డళ్లతో విధ్వంసం

2 Jul, 2019 08:34 IST|Sakshi

1719 సోలార్‌ మాడ్యుల్స్‌ను ధ్వంసం చేసిన వైనం

కేసు నమోదు చేసిన పోలీసులు 

సాక్షి, జమ్మలమడుగు/మైలవరం(కడప) : మైలవరం మండల పరిధిలోని పొన్నంపల్లి, రామచంద్రాయపల్లి తది తర ప్రాంతాల పరిధిలో ఉన్న సోలార్‌ ప్రాజెక్టులో  ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు ప్రాజెక్టులో ఉన్న దాదాపు 1719 సోలార్‌ మాడ్యుల్స్‌ను గొడ్డళ్లతో పగులగొట్టారు. సోమవారం తెల్లవారు జామున సోలార్‌ అధికారులు విషయాన్ని తెలుసుకున్నారు. 

రూ. 3 కోట్ల నష్టం.. 
ఐదువేల ఎకరాల్లో రూ.6వేల కోట్లతో 1000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. అందులో మొదటి విడత కింద రూ.1500 కోట్లతో 250 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో ఎవరూ లేని సమయంలో దుండగులు1719 సోలార్‌కు సంబంధించిన మాడ్యుల్స్‌ పగులగొట్టినట్లు కంపెనీ యాజమాన్యం గుర్తించింది. పగుల కొట్టిన మాడ్యుల్స్‌ విలువ దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు మైలవరం పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ పెద్దినేని ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. 

రాజకీయ కక్షతోనేనా.!
సోలార్‌ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో టీడీపీకి చెందిన నాయకులు సోలార్‌ ప్లాంట్‌లో పనులు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కంపెనీ యాజమాన్యం కొందరిని తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో వారు కక్ష గట్టి సోలార్‌ మాడ్యుల్స్‌ను పగులగొట్టారనే వాదన స్థానిక అధికారులు, కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి వినిపిస్తోంది.  

మరిన్ని వార్తలు