నకిలీ ఆధార్‌ కార్డులతో వెట్టిచాకిరీ!

5 Aug, 2019 15:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిక్కుతోచని స్థితిలో వెట్టి వెతలో చిక్కుకుపోయిన బాల, బాలికలకు విముక్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్‌ ముస్కాన్‌–5లో ఇప్పటివరకు సైబరాబాద్‌లో 541 మంది పిల్లలను రెస్క్యూ చేశామని సైబరాబాద్ సీపీ విసి సజ్జనార్ వెల్లడించారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌ ముస్కాన్‌లో లేబర్426, బెగ్గింగ్39, విధి బాలలు 33 మందిని ముస్కాన్ టీమ్ రెస్క్యూ చేసిందని అన్నారు. రెస్క్యూ చేసిన వారిలో 483 మైనర్ బాలురు, 58 బాలికలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరి, జూలైలో ముస్కాన్‌ ఆపరేషన్ నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. రక్షించిన వారిలో 62 మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చామని, రెస్క్యూ చేసిన పిల్లలను మొబైల్ యాప్ దర్పన్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. వెట్టి నుంచి విముక్తి కల్పించిన బాలకార్మికుల్లో ముగ్గురు హెచ్‌ఐవీతో బాధపడుతుండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు 338 మంది ఉన్నారని వివరించారు.

కొంత మంది పిల్లలకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి సరైన ఆహారం ఇవ్వకుండా టీస్టాల్స్, దాబాలు, చిన్నతరహా పరిశ్రమలు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్‌ జంక్షన్లు, ప్రార్థన మందిరాల సమీపాల్లో భిక్షాటన చేయిస్తున్నారన్నారు. అంతేకాక ఎక్కువ వేడి ఉండే పని చేయించడంతో చాలా మంది పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఎక్కువ పని చేయించుకొని తక్కువ వేతనం ఇస్తున్నారని ఇలాంటివి ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఇలా నిబంధనలు అతిక్రమించిన పరిశ్రమల యజమానులపై రాష్ట్రవ్యాప్తంగా 478 కేసులు నమోదైతే ఒక్క సైబరాబాద్‌లోనే 247 కేసులు నమోదు చేశామన్నారు. చైల్డ్ లేబర్ యాక్ట్2016 ప్రకారం, ఐపీసీ 374 కింద 247 కేసులు నమోదు చేశామని తెలిపారు. పిల్లలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు.ఇప్పటి వరకు రెస్క్యూ హోమ్ లో 479 మంది పిల్లలను తరలించామని, అందులో 429 మంది బాలురు, 50 మంది బాలికలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు