చిరుతపులి చర్మం.. ఆన్‌లైన్‌ ద్వారా ట్రేడింగ్‌

20 Nov, 2019 10:35 IST|Sakshi

పులి చర్మం విక్రయిస్తున్న ముఠా అరెస్టు

చిరుత చర్మం, పులి గోర్లు స్వాధీనం

వాటి విలువ మార్కెట్‌లో రూ.70 లక్షలు 

నిందితుల్లో మాజీ సైనికుడు, ఏఆర్‌ కానిస్టేబుల్‌

కేసు వివరాలు వెల్లడించిన గిద్దలూరు డీఎఫ్‌ఓ జి.సతీష్

సాక్షి, గిద్దలూరు: పులి చర్మం విక్రయిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠా అటవీశాఖ అధికారులకు పట్టుబడింది. ఆన్‌లైన్‌ ద్వారా ట్రేడింగ్‌ చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు నిందితుల సెల్‌ ఫోన్లను ట్రాక్‌ చేసి, వీరి ఆటకట్టించారు. వాహనంలో తరలిస్తున్న చిరుత పులి చర్మం, పులి గోర్లను స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు అటవీశాఖ డివిజనల్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అటవీశాఖ డివిజనల్‌ అధికారి జి.సతీష్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. చిరుతపులి చర్మం విక్రయించేందుకు కొందరు ఆన్‌లైన్‌ ద్వారా ట్రేడింగ్‌ చేస్తున్నారనే సమాచారంతో అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ముఠా సభ్యుల ఫోన్‌ నంబర్లను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వారి సెల్‌ఫోన్ల ద్వారా వెళ్లే సందేశాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గిద్దలూరు మండలంలోని అంబవరం నుంచి రాచర్ల మండలంలోని రంగస్వామి ఆలయం వైపునకు వెళ్తున్న బొలెరో వాహనంలో పులి చర్మాన్ని తరలిస్తున్నారని తెలుసుకొని అడ్డుకున్నారు.

ఆ వాహనానంతో పాటు మరో ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఒంగోలుకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ దోనంపూడి శ్రీనివాసరావు, డ్రైవర్‌ చీమకుర్తి మండలం పల్లాపల్లికి చెందిన కుంచాల శ్రీనును అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరి ఫోన్‌ మెసేజ్‌లు, కాల్‌ డేటా ఆధారంగా మరో ఏడుగురు నిందితులను  అదుపులోనికి తీసుకున్నారు. వీరిలో గిద్దలూరు మండలంలోని జయరాంపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మోడి రంగస్వామి పేరు గల ఇద్దరు, ఎండూరి ఆనంద్, రాచర్ల మండల కేంద్రానికి చెందిన మాజీ సైనికుడు షేక్‌ సుభాని, గిద్దలూరుకు చెందిన డ్రైవర్‌ తోట వేణుమాధవ్, వెలిగండ్లకు చెందిన జి.భూపాల్‌రెడ్డి, గిద్దలూరుకు చెందిన పసుపులేటి గోపాలకృష్ణలు ఉన్నారు. 

స్వాధీనం చేసుకున్న చిరుత పులి చర్మం అధికారులు స్వాధీనం చేసుకున్న పులి గోర్లు
మార్కెట్‌ విలువ రూ.70 లక్షలు..
నిందితులను నుంచి చిరుత చర్మం, మూడు గోర్లు స్వాధీనం చేసుకోగా మిగిలినవి చర్మానికే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ చర్మం విలువ మార్కెట్‌లో రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటుందని, అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంకా ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని డీఎఫ్‌ఓ చెప్పారు. చిరుత వయస్సు సుమారు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటుందని, ఏడాదిన్నర క్రితమే చంపి చర్మం తీసినట్లు తెలుస్తోందన్నారు. చర్మాన్ని సంబంధిత టీసీఎంబీ ల్యాబ్‌కు పంపించి పరీక్షించిన తర్వాత చిరుత వయస్సు, ఎప్పుడు తీశారనేది తెలుస్తుందన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను బుధవారం మార్కాపురం కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లడించారు.

వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు...
వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ సతీష్‌ హెచ్చరించారు. ఎక్కడైనా వన్యప్రాణులను వేటాడటం, చంపడం, చర్మం తీయడం, మాంసం విక్రయించడం వంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. వన్యప్రాణులు ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టవని, అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్లి వాటికి ఇబ్బంది కలిగిస్తే దాడులు చేస్తాయన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

గిద్దలూరు ప్రాంతంలో 48 వరకు పులులు ఉన్నాయని ఇప్పటికే వాటి సంఖ్య తగ్గిపోయిందని, వన్యప్రాణులను కాపాడుకోవాలి్సన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వన్యప్రాణులు ఎక్కడైనా ప్రజలకు నష్టం కలిగిస్తే అందుకు తగిన పరిహారం అందిస్తున్నామన్నారు. గత నాలుగైదు సంవత్సరాల్లో రూ.10 లక్షల వరకు చెల్లించామన్నారు. ప్రస్తుతం ఐదుగురికి రూ.1.60 లక్షలు ఇచ్చేందుకు నిధులు వచ్చాయని, త్వరలో పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ గిద్దలూరు, గుండ్లకమ్మ, తురిమెళ్ల రేంజి అధికారులు కుమారరాజ, నాగేంద్రరావు, జీవన్‌కుమార్, డిప్యూటీ రేంజి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు