చాటుగా కలుసుకునే వారే వీరి టార్గెట్‌

5 Jul, 2020 11:31 IST|Sakshi

సాక్షి, నల్గొండ : వివాహేతర సంబంధాలతో చాటుమాటుగా కలుసుకోవడాన్ని ఆసరాగా చేసుకొని కొందరు దుండగలు వారిని బెదిరించి బంగారం, డబ్బులు దోచుకుంటున్న ఉదంతం శనివారం మండల పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే వారిపై దాడి చేస్తూ మహిళలను శారీరకంగా అనుభవిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి పలు సంఘటనలు చిలుకూరు మండలంలోని సీతారాంపురం గుట్టల్లో తరచుగా జరుగుతున్నాయి. అయినా బాధితులు బయటికి చెప్పుకోకపోవడంతో ఇన్నాళ్లూ బాహ్య ప్రపంచానికి తెలియలేదు. ఇటీవల ఓ బాధితుడు విషయం బయటపెట్టడంతో చిలుకూరు పోలీస్‌స్టేషన్‌లో పలువురిపై కేసు నమోదు అయింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం...చిలుకూరు మండల పరిధిలోని సీతారాంపురం సమీపంలో కోదాడ– హుజూర్‌నగర్‌ రహదారి పక్కన పెద్ద గుట్టలు ఉన్నాయి. ఇవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. దాంతో దీనిని గమనించిన సీతారాంపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడకు వచ్చే జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. మొదట వీరు వివాహేతర జంటలను గుర్తించి వారి వద్దకు వెళ్తారు. బెదిరించి వారి నుంచి వివరాలు సేకరిస్తారు. ఆ విషయాలను సంబంధీకులకు చెబుతామని బ్లాక్‌మెయిల్‌ చేసి నగలు, డబ్బులు లాక్కొని పారిపోతారు. వినకుంటే గాయపరుస్తారు. మరి కొందరు దుండగులు మహిళలను శారీరకంగా అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు గత నెల రోజుల్లోనే మూడునాలుగు జరిగినట్లుగా తెలిసింది.  

భయటపడింది ఇలా... 
దుండగులకు ఈనెల 2వ తేదీన గుట్టల్లో ఓ జంట దొరికింది. దాంతో వారి వద్దకు వెళ్లి బెదిరించారు. వారి ఫొటోలు తీశారు. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేశారు. ఇస్తామని ఒప్పుకోవడంతో యువతిని వదిలేశారు. దాంతో ఆమె పరారైంది. అనంతరం యువకుడిని డబ్బులు డిమాండ్‌ చేయగా తన వద్ద లేవని చెప్పడంతో చిలుకూరు ఏటీఎం వద్దకు తీసుకొచ్చి డబ్బులు డ్రా చేసి తీసుకున్నారు. అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు. దాంతో బాధితుడు 3వ తేదీన తన బంధువులతో కలిసి సీతారాంపురం గ్రామంలో ఆ వ్యక్తుల కోసం వెతికారు. స్థానికుల సహాయంతో దుండగుల పేర్లు సేకరించారు. గ్రామంలోని పెద్ద మనుషుల సహకారంతో వారిని గ్రామపంచాయతీకి పిలిపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దుండగులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయగా నిజం ఒప్పుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా