మూత్రానికి ఆగితే బీఎండబ్ల్యూ కారుతో పరార్‌..

16 Mar, 2020 08:54 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

నోయిడా : బీఎండబ్ల్యూ కారులో వెళుతున్న వ్యక్తి మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కన ఆగిన క్రమంలో కొందరు దుండగులు కారుతో పరారైన ఘటన ఆదివారం నోయిడాలో వెలుగుచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సెక్టార్‌ 90లో శనివారం రాత్రి పార్టీకి హాజరై తిరిగివస్తున్న షేర్‌ మార్కెట్‌ బ్రోకర్‌ రిషబ్‌ అరోరా మార్గమధ్యలో మూత్రం పోసేందుకు కారును ఆపారు. ఇదే అదనుగా కొందరు దుండగులు లగ్జరీ కారుతో ఉడాయించారు. ఈ కారు అరోరా బావమరిదిదని, ఈ వాహనంపై రూ 40 లక్షల రుణం పెండింగ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. బీఎండబ్ల్యూ కారు చోరీకి గురైందని తెలిసిన వెంటనే తమ బృందంతో పోలీసు అధికారులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు.

కారు యజమానికి తెలిసిన వారే ముందస్తు ప్లాన్‌ ప్రకారం చోరీకి పాల్పడి ఉంటారని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని సీనియర్‌ పోలీస్‌ అధికారి హరీష్‌ చందర్‌ అన్నారు. బీఎండబ్ల్యూ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే వాహనం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. కాగా బీఎండబ్ల్యూను నడిపిన స్టాక్‌ బ్రోకర్‌ అరోరా ఆ సమయంలో తాగిఉన్నాడని తెలిసింది. అరోరాపై డ్రంకెన్‌ డ్రైవింగ్‌ కింద చర్యలు చేపడతారా అని ప్రశ్నించగా, బీఎండబ్ల్యూను రికవర్‌ చేసి, నిందితులను శిక్షించడానికే ముందుగా తాము ప్రాధాన్యత ఇస్తామని, నగరంలో వేరొకరి కారును ఈ తరహాలో తస్కరించడం సీరియస్‌ అంశమని పోలీస్‌ అధికారి చందర్‌ స్పష్టం చేశారు. అరోరా తన బావమరిది కారును ఆరేడు రోజుల నుంచి వాడుతున్నట్టు తెలిసిందని అన్నారు. ఇక బైక్‌పై వచ్చిన నిందితులు తనపై తుపాకీ గురిపెట్టి బెదిరించారని అరోరా చెబుతున్నా ఆయన తాగిఉండటంతో ఆ విషయం నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు.

చదవండి : ఆటోను ఢీకొన్న యువనేత బీఎండబ్ల్యూ..

మరిన్ని వార్తలు