తండ్రిని చంపిన కొడుకు

15 Jun, 2020 04:29 IST|Sakshi
సోమ్లానాయక్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్‌

భూ తగాదాలే కారణం 

పరారీలో కొడుకు, కోడలు

సిద్దిపేట జిల్లాలో ఘటన

అక్కన్నపేట (హుస్నాబాద్‌): భూ వివాదం వల్ల కన్న తండ్రిని కొడుకే హత్య చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లునావత్‌ సోమ్లానాయక్‌ (70), అతని కుమారుడు సమ్మయ్యకు మధ్య ఎనిమిదేళ్లుగా భూ తగాదాలు నడుస్తున్నాయి. సోమ్లాకు ముగ్గురు కుమారులు ఉండగా ఒక కుమారుడు కొంతకాలం కిందట మృతి చెందాడు. ఆస్తి పంపకంలో తన వాటా ఇంకా రావాల్సి ఉందని పెద్ద కొడుకు సమ్మయ్య.. తండ్రితో గొడవ పడేవాడు.

ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట పొలం వద్ద తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఉన్న సమ్మయ్య ఆదివారం పొలం నుంచి ఇంటికి వస్తున్న తండ్రిని మార్గమధ్యలో కర్రతో తలపై బలంగా కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రస్తుతం కొడుకు సమ్మయ్య, కోడలు లక్ష్మి పరారీలో ఉన్నారని ఎస్సై రవి తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్‌ పరిశీలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు