కౌలు డబ్బుల కోసం కన్నతల్లికి నిప్పు

13 May, 2020 13:31 IST|Sakshi

చావుబతుకుల మధ్య తల్లి

ఆదిలాబాద్‌, జైనథ్‌: భూమికి సంబంధించిన కౌలు డబ్బుల కోసం కన్నతల్లిపై పెట్రోలు పోసి నిప్పంటించాడో కొడుకు. ఈ హృదయ విదారకమైన సంఘటన జైనథ్‌ మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఒడ్డెర కాలనీకి చెందిన ర్యాపని లసుంబాయి(60)కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. భర్త చనిపోయాడు. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటోంది. అయితే తనకున్న ఐదెకరాల భూమిని కౌలుకు ఇస్తూ ఆ డబ్బులతో బతుకుతోంది.

ఆ డబ్బులపై కన్నేసిన ఆమె పెద్ద కుమారుడు నాందేవ్‌ తరచూ గొడవ పడుతున్నాడు. ఈ ఏడాది కూడా లసుంబాయి ఓ వ్యక్తికి ఇటీవల భూమిని కౌలుకు ఇవ్వగా.. అతడు కొన్ని డబ్బులు ఇచ్చాడు. దీంతో నాందేవ్‌ మద్యం తాగి తల్లి వద్దకు వచ్చి గొడవకు దిగాడు. డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో భార్య దీపికను బెదిరించి పెట్రోల్‌ తెప్పించాడు. వెంటనే తల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. అక్కడే ఉన్న లసుంబాయి కూతురు శాంత, చిన్న కోడలు సుశీల, చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పివేశారు. ఆమెను వెంటనే ఆటోలో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల ద్వారా తెల్సింది. శాంత ఫిర్యాదు మేరకు నాందేవ్, అతడి భార్య దీపికపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. 

మరిన్ని వార్తలు