కొడుకు చేతిలో తండ్రి హతం

17 May, 2019 08:39 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ   

సాక్షి, అనంతపురం : ఆర్థిక లావాదేవీలు తండ్రీ కొడుకుల మధ్య చిచ్చురేపాయి. డబ్బును వృథాగా ఖర్చు చేస్తున్నావని దండించినందుకు కోపోద్రిక్తుడైన తనయుడు రేషం ఆకులు కోసే కొడవలితో తండ్రిపై దాడి చేశాడు. అంతే ఆ తండ్రి పొలంలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన రొద్దం మండలం నారనాగేపల్లి గ్రామపంచాయతీ జక్కలచెరువులో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. జక్కలచెరువు గ్రామానికి చెందిన కురుబ అంజినప్ప(55)కు ఇద్దరు కొడుకులు. గ్రామంలో మంచి పేరున్న కుటుంబం వారిది. అయితే పెద్ద కుమారుడు యల్లప్ప డబ్బు ఎక్కువగా వృథా చేస్తుండేవాడు.

ఇదే విషయమై గురువారం ఉదయం రాచూరు గ్రామ సమీపానున్న తమ వ్యవసాయ పొలంలో తండ్రి, పెద్ద కుమారుడు గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన యల్లప్ప రేషం ఆకు కోస్తున్న కొడవలితో తండ్రి అంజినప్ప గుండెపై నరికాడు. అంజినప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కుమారుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్తూవెళ్తూ రాచూరుకు చెందిన ఓ వ్యక్తికి ఫోన్‌ చేసి తన తండ్రిని చంపేశానని చెప్పాడు. గ్రామస్తుల సమాచారంతో సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సురేష్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. అంజినప్ప భార్య సావిత్రమ్మ, కోడలు నీలావతి, బంధువులు బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు