తల్లి గొంతు కోసిన కొడుకు

22 Nov, 2019 05:17 IST|Sakshi
ఉస్మానియాలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి

పెళ్లి చేయడం లేదని అఘాయిత్యం

కాగజ్‌నగర్‌ టౌన్‌: మద్యం, గంజాయికి బానిసైన కొడుకు కసాయిగా మారి కన్నతల్లి గొంతుకోశాడు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్‌ కాలనీలో నివాసముంటున్న తాడూరి సంధ్యారాణి అంగన్‌వాడీ ఆయాగా పనిచేస్తోంది. సంధ్యారాణికి కుమారుడు, కూతురు ఉండగా భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకు ప్రశాంత్‌ గత కొద్ది కాలంగా మద్యం, గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. కాగా ప్రశాంత్‌ తనకు పెళ్లి చేయాలని, మద్యానికి డబ్బులు ఇవ్వాలని గత కొద్ది రోజులుగా తల్లిని వేధిస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రశాంత్‌ తల్లితో గొడవపడ్డాడు. కోపంతో ఉన్న ప్రశాంత్‌ గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నిద్రిస్తున్న తల్లి సంధ్యారాణి గొంతును కత్తితో కోశాడు. దాంతో తీవ్ర గాయాలతో ఆమె కేకలు వేయడంతో ప్రశాంత్‌ అక్కడి నుంచి పారిపోయాడు. చుట్టుపక్కల వారు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని సంధ్యారాణిని సిర్పూర్‌(టి) సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సంధ్యారాణి ఉస్మానియాలో చికిత్స పొందుతుండగా, ప్రశాంత్‌ పరారీలో ఉన్నట్లు ఎస్సై గంగన్న తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పట్టణ సీఐ తెలబోయిన కిరణ్‌ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు