కన్నపేగుకదా..కేసెట్లా పెట్టాలె..

22 Jun, 2018 11:28 IST|Sakshi
ఏఎంసీ వైస్‌చైర్మన్‌ వేణుమాధవ్‌తో గోడు వెల్లబోసుకుంటున్న వృద్ధురాలు 

వృద్ధురాలి మాతృత్వపు మమకారం

వేమనపల్లి(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన దేనబోయిన పోచక్క 88 ఏళ్ల వృద్ధురాలు. ఆమెకు గుండయ్య, శంకర్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా కాలంగా పోచక్క చిన్న కొడుకు గుండయ్య వద్దే ఉంటోంది. దీంతో నా వద్ద ఉండొద్దు.. అన్నవద్దకు పో.. అంటూ గుండయ్య తరచూ గొడవ  పెడుతున్నాడు. ఇటీవల మాటామాటా పెరగటంతో కొడుకూ కోడలు ఆమెపై చేయిచేసుకున్నారు.

గూని నడుముతో నడవలేని స్థితిలో ఉన్నా మండల కేంద్రానికి వచ్చిన బెల్లంపల్లి ఏఎంసీ వైస్‌చైర్మన్‌ వేణుమాధవ్‌ను కలిసింది. తనకు న్యాయం చేయాలని ఆయన పాదాల మీద పడింది. కొడుకూ, కోడలు కలిసి నన్ను కొడ్తుండ్రు.. జెర బుద్ధి చెప్పుండ్రి అంటూ బోరుమంది. దీంతో ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమని సూచించాడు.

ముసలవ్వ మాత్రం ‘కన్న పేగు కదా పంతులూ.. కేసెట్టా పెట్టాలె.. రేపో మాపో దేవుని దగ్గరికి పోయేదాన్ని. మా అవ్వ నన్ను ఠాణాల పెట్టి కొట్టించింది అని కొడుకు ఏడుత్తడు.. నేను ఠానాకు పోను.. మీరే బుద్దిమాట చెప్పుండ్రి’ అని వేడుకుంది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కొడుకు కొట్టినా వెనకేసుకొచ్చిన తల్లి ప్రేమను అభినందించారు.

మరిన్ని వార్తలు