కొడుకే కిరాతకుడు

16 Jun, 2020 13:16 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎస్పీ హరినాథరెడ్డి, పక్కన సీఐ ఖాజావలీ, ఎస్సై అంజిరెడ్డి

తల్లి హత్య కేసులో అరెస్ట్‌

నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వెల్లడి

ముత్తుకూరు: తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకుని ముత్తుకూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథరెడ్డి వివరాలను సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. చేజర్ల మండలం, తూర్పుకంభంపాడుకు చెందిన తలపల రమణయ్య, భార్య రమణమ్మ, పెద్ద కొడుకు చెంచురామయ్య, రెండో కొడుకు వెంకటేశ్వర్లు అతని భార్య విజయమ్మలు ఐదునెలలుగా బాతులు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ మద్యం అలవాటు ఉంది. మద్యం మత్తులో చెంచురామయ్య తన మరదలిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని వెంకటేశ్వర్లు పలుమార్లు తల్లి రమణమ్మ దృష్టికి తీసుకెళ్లాడు.

అయితే, ఆమె వెంకటేశ్వర్లును తిట్టి, పెద్దకొడుకునే సపోర్ట్‌ చేసింది. ఈ నెల 4వ తేదీన వీరంతా మండలంలోని పొట్టెంపాడు సమీపంలోని సర్వేపల్లి రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. ఇక్కడ కూడా అన్నదమ్ములు గొడవపడ్డారు. ఈక్రమంలో రమణమ్మ పెద్దకొడుక్కే సపోర్ట్‌ చేయడంతో ఆగ్రహించిన వెంకటేశ్వర్లు కత్తితో తల్లి మెడ మీద నరికాడు. దీంతో మిగిలిన వాళ్లు వెళ్లిపోయారు. నిందితుడు తల్లి శవాన్ని అక్కడి మిట్టకాలువ తూములో పడేసి పరారయ్యాడు. ఈనెల 5వ తేదీన దీనిని హత్య కేసుగా నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. వేగంగా దర్యాప్తు చేసి నిందితుడు వెంకటేశ్వర్లును అరెస్ట్‌ చేసిన కృష్ణపట్నం సీఐ షేక్‌ ఖాజావలీ, ఎస్సై అంజిరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ అశోక్‌లను డీఎస్పీ అభినందించారు. జిల్లా ఎస్పీ ద్వారా రివార్డులు అందజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు