కన్న కొడుకే కాలయముడు

12 Dec, 2019 13:09 IST|Sakshi
శోభనాద్రి మృతదేహం

తండ్రిపై చాకుతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య

ఆస్తి విషయంలో విభేదాలే కారణం

ఆగిరిపల్లిలోని ఈదరలో ఘటన

ఆగిరిపల్లి(నూజివీడు): తనయుడి చేతిలో తండ్రి హతమయ్యాడు. ఈ ఘటన ఆగిరిపల్లి మండలంలోని ఈదరలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఈదరకు చెందిన బెక్కం శోభనాద్రి(58)కి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె అమెరికాలో నివసిస్తుండగా, కుమారుడు కిరణ్‌ గ్రామంలోనే ఉంటున్నాడు. శోభనాద్రికి 22 ఎకరాల పొలం ఉంది. కుమారుడి మొదటి భార్య మృతిచెందింది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం మరొక వివాహం చేయగా ఆమె విడిపోవడంతో మూడో వివాహం చేసుకున్నారు. మూడో భార్య ద్వారా ఒక కుమార్తె జన్మించింది. శోభనాద్రి తన మనవడి పేరుతో ఐదు ఎకరాల భూమిని రాశాడు. మిగిలిన ఆస్తి కూడా తన పేరు మీద రాయమని కిరణ్‌ తండ్రితో వాగ్వాదానికి దిగాడు.

ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు జరగ్గా పెద్ద మనుషుల పంచాయితీలో సగం ఆస్తి రాస్తానని తండ్రి హామీ ఇచ్చాడు. అయినప్పటికీ ఒప్పుకోక ఆస్తి పంచడం లేదని ఇంట్లోంచి బయటకు వచ్చి అద్దె ఇంట్లో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రిని చంపుతానని మంగళవారం బెదిరించడంతో గ్రామంలో ని బెక్కం కృష్ణమూర్తి ఇంట్లో భయంతో తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం కృష్ణమూర్తి ఇంటి ముందు ఉండగా అక్కడికి ద్విచక్రవాహనంపై వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న చాకుతో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు.   హనుమాన్‌జంక్షన్‌ సీఐ డీవీ రమణ, ఆగిరిపల్లి ఎస్‌ఐ పి.కిషోర్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి భార్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి భార్య నాగమల్లేశ్వరి  ఫిర్యాదు మేరకు సీఐ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా