ఆస్తి కోసం అమానుషం

31 Oct, 2019 10:42 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ నర్సింహారావు

మరణ వాంగ్మూలంతో వెలుగులోకి...

శామీర్‌పేట్‌:  భూమిని తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయలేదని ఓ వ్యక్తి భార్యతో కలిసి తండ్రిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన సంఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం వెలుగులోకి వచ్చింది. పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ నర్సింహారావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పొన్నాల్‌ గ్రామానికి చెందిన మరియాల బాలనర్సింహకు సంతానం లేకపోవడంతో తన సోదరుడి కుమారుడైన నర్సింహను   దత్తత తీసుకున్నాడు. పెంచి పెళ్లి చేశాడు. కాగా బాల నర్సింహ పేరున ఉన్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలని నర్సింహ అతడిపై ఒత్తిడి చేస్తున్నాడు.

ఇందుకు బాల నర్సింహ అంగీకరించకపోవడంతో తండ్రి చనిపోతే భూమి  దక్కుతుందనే దుర్భుద్ధితో మే 4వ తేదీ రాత్రి   అతను తన భార్య జాంగిరమ్మతో కలిసి బాల్‌నర్సింహపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. అతను కేకలు వేయడంతో వారే మంటలను ఆర్పి, 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాల నర్సింహ జూన్‌ 6న  మృతి చెందాడు. చనిపోయే ముందు అతను గుర్తు తెలియని వ్యక్తులు తన పై కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో అతని కుమారుడు నర్సింహ, కోడలు జాంగిరమ్మలను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో  సీఐ నవీన్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు