హత్య కేసులో నిందితుల అరెస్టు

20 Nov, 2018 13:13 IST|Sakshi
కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ సుబ్బారావు ,బీబీజాన్, ఆసీఫా

కూతురిపై కన్నతండ్రి వికృత చేష్టలు

భరించలేక తండ్రిని కడతేర్చిన కూతురు, కొడుకు

చిత్తూరు  , పాకాల: హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్టేషన్‌లో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. పీలేరు పట్టణంలోని బాపూజీ నగర్‌ కాలనీకి చెందిన తాపీమేస్త్రీ కరీముల్లా కన్న కూతురు ఆసీఫాపైనే వికృత చేష్టలు చేస్తుండేవాడు. భర్తకు దూరంగా ఉన్న కూతురిని రూ.5 లక్షలకు అమ్మేయాలని చూశాడు. ఇది తెలిసిన అతని కుమారుడు చాంద్‌బాషా(27), తన తండ్రిని చంపేస్తే తన చెల్లెలి జీవితం ప్రశాంతంగా ఉంటుందని భావించాడు. దీంతో ఒక పథకం పన్నాడు.

ఈ నెల 13వ తేదీ రాత్రి అదే పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన తన స్నేహితుడు ఎం.గణేష్‌(28), చెల్లెలు ఆసీఫా(21), రొంపిచెర్ల మండలం బండకిందపల్లి పంచాయతీ హనుమంతురాయనిపేటకు చెందిన అమ్మమ్మ బీబీజాన్‌(70)తో కలసి తండ్రిని క్షుద్రపూజల నెపంతో ఆటోలో దామలచెరువు, పాకాల, నేండ్రగుంట మీదుగా పెనుమూరు మార్గంలోని కుప్పరాళ్లగుట్ట వద్దకు తీసుకెళ్లారు. తండ్రిచేత అతిగా మద్యం తాగించి చెల్లెలి విషయమై గొడవ పెట్టుకున్నారు. మాట వినకుండా పారిపోతున్న కరీముల్లాను రాళ్లు, కట్టెలతో బాది, ప్లాస్టిక్‌ వైర్‌తో గొంతు బిగించి చంపేశారు. అక్కడే గుంతతీసి పూడ్చేశారు. ఈ కేసును సీఐ హరినాథ్‌ తన సిబ్బందితో విచారణ చేపట్టారు. ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా కేసును ఛేదించారు. నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, వంశీధర్, సిబ్బంది మౌలాన, మణి, వేణు, జయ్‌కుమార్, భద్ర, గిరి, ముక్తి, కేశవ, శేఖర్, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు