తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

16 Jul, 2019 12:34 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్‌) : ఆస్తి మొత్తాన్ని తన తమ్ముడికే ఇస్తున్నాడని ఎన్నిసార్లు అడిగినా తనకు ఇవ్వడం లేదని కన్న తండ్రిపైనే కక్ష పెంచుకున్నాడు. తండ్రి పట్టించుకోకపోవడంతోనే తన బతుకు ఆగమైందని భావించాడు. పథకం ప్రకారం తండ్రిని హత మార్చాడు. బీబీపేట గ్రామ శివారులోని డాక్‌ బంగ్లా వద్ద మే 6న జరిగిన బోయిని నర్సయ్య హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడైన మృ తుని పెద్ద కొడుకు రాజయ్యను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు భిక్కనూరు సీఐ రాజశేఖర్‌ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని నర్సయ్య(60)కు ఇద్దరు కుమారులు. ఐదేళ్ల క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మృతిచెందింది. పెద్దకొడుకు రాజయ్య తండ్రితో వేరుపడి అదే గ్రామంలో మరో చోట ని వసిస్తున్నాడు. నర్సయ్య చిన్న కొడుకు రాములుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆస్తులన్నీ అతని పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నాడని చాలాసార్లు పెద్దకొడుకు పంచాయితీలు పెట్టాడు. అయినా అతడికి ఆస్తులు ఇవ్వలేదు. ఆస్తి కేటాయింపుల విషయంలో జరిగిన ఘర్షణలో బీబీపేట ఠాణాలో ఇదివరకే రాజయ్యపై కేసు నమోదైంది.

నర్సయ్యకు పొలంలో రెండు బోర్లు ఉండగా పక్కనే ఉన్న అతని పెద్ద కొడుకు రాజయ్య పొలానికి నీరు ఇవ్వలేదు. నీళ్లు లేక భూమి బీడుగా మారిపోయింది. దీంతో రాజయ్య కొంతకాలంగా ట్రాక్టర్‌ నడిపిస్తు డిచ్‌పల్లిలో పనిచేసుకుంటున్నాడు. రాజయ్య పెద్ద కొడుకు హైదరాబాద్‌లో ట్యాంకర్‌ క్లీనర్‌గా పనిచేసుకుంటు చదువుతున్నాడు. రాజయ్య భార్య చిన్న కొడుకులు గ్రామంలోనే ఉంటున్నారు. తన తండ్రి పట్టించుకోకపోవడంతోనే తన బతుకు, తన కుటుంబం ఆగమైందని భావించాడు రాజ య్య. ఎలాగైనా తండ్రిని చంపాలనుకున్నాడు. ఈ క్రమంలో మే 6న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో టీవీఎస్‌ ఎక్సల్‌ వాహనం నర్సయ్య పొలం వద్దకు రాగా అప్పటికే అక్కడున్న రాజయ్య ఆస్తివాటా గురించి అడిగాడు. తండ్రి ఇవ్వను అనడంతో కర్రతో బలంగా తలపై బాదాడు. దీంతో నర్సయ్య చనిపోయాడు. ఎవరికి అనుమానం రాకుండా రాజయ్య అక్కడి నుంచి వెళ్లిపోయా డు. దర్యాప్తులో భాగంగా రాజయ్యను విచారించగా నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నిందితుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.    

మరిన్ని వార్తలు