అమ్మ చావలేదు..చంపాడు..!

7 Mar, 2019 13:04 IST|Sakshi
హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న రాజంపేట డీఎస్పీ మురళీధర్, చిత్రంలో సీఐ నరసింహులు, ఎస్‌ఐ వెంకటరమణ

సాక్షి, రాజంపేట: పెనగలూరు మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన ఊటుకూరు సిద్ధమ్మ (85)ను హత్య చేసిన కేసులో తనయుడు ఊటుకూరు రామచంద్రారెడ్డి, మనవడు గిరిధర్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ మురళీధర్‌ తెలిపారు. బుధవారం రాత్రి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ నరసింహులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దమ్మను ఆమె చివరి కొడుకు రామచంద్రారెడ్డి హత్య చేసి, తన కొడుకు గిరిధర్‌రెడ్డి సహాయంతో కువైట్‌కు వెళ్లిపోయేందుకు ఇన్నోవా వాహనంలో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడ వారిని విమానంలో ప్రయాణం చేయకుండా నిలుపుదల చేశారు. దీంతో వారిని అక్కడ అరెస్టు చేశారు. మృతురాలికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు  ఉన్నారు. మృతురాలి భర్త 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. సిద్ధమ్మ వయోభారంతో పాటు అనారోగ్యంతో మంచంపైనే జీవనం సాగిస్తోంది.

గత మూడు నెలలుగా రామచంద్రారెడ్డితోపాటు అన్నదమ్ములు అందరు ఒక్కొక్కరు ఒక నెల చొప్పున తల్లిని చూసుకునే విధంగా అంగీకారం చేసుకున్నారు. రామచంద్రారెడ్డి వద్ద సిద్ధమ్మ ఉండే సమయంలో ఆమెను ఎంత బాగా చూసుకున్నప్పటికి కొడుకు, కోడలు సరిగా చూసుకోలేదని కనిపించిన వారికి చెబుతూ వచ్చేది. దీంతో తల్లిపై తనయుడు కోపం పెంచుకున్నాడు. ఈనెల 4న రాత్రి సుమారు 12.50 గంటల ప్రాంతంలో సిద్ధమ్మ ముఖంపై గుడ్డతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి గొంతు నులిమి చంపేశాడు. తల్లి చనిపోయిన తర్వాత తన తల్లిది సహజ మరణం అని అన్నదమ్ములందరిని నమ్మించాడు.

అందరితో కలిసి ఆమె కర్మకాండలను జరిపించాడు. నేర స్థలానికి ఎదురుగా ఉన్న యశోదమ్మ ఇంట్లో గల సీసీ కెమెరా పుటేజీలను చూస్తే, తన నేరం బయటపడుతుందని రామచంద్రారెడ్డి భయపడి బెంగళూరు ఎయిర్‌పోర్టు ద్వారా కువైట్‌కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ కంట్రోల్‌కు ఫ్యాక్స్‌ ద్వారా సమాచారం పంపి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వివరించారు. సమావేశంలో పెనగలూరు ఎస్‌ఐ వెంకటరమణ , సిబ్బంది పాల్గొన్నారు.

ఆ అమ్మకు రోజూ చిత్రహింసలే 
పెనగలూరు : కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన  మాతృమూర్తి సిద్దమ్మ బతికి ఉన్నన్ని రోజులు కొడుకులు, కోడళ్ల చేతిలో చిత్రహింసలకు గురైనట్లు తెలుస్తోంది. ఆమెకు ఐదుగురు సంతానం కాగా ఒక్కో కుమారుడు ఒక్కో నెల చూసుకునేలా ఒప్పందం కుదిరింది. అయితే కొంతమంది కోడళ్ల వంతు వచ్చినప్పుడు వారుపెట్టే చిత్రహింసలు చూసి  చుట్టు పక్కల వాళ్లు చలించిపోయేవారని తెలిసింది. ఒక కోడలు ఏకంగా కట్టె తీసుకుని ఆమెను కొట్టిన విషయం సీసీ పుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కసారి వృద్ధురాలు ఏడుస్తున్నా కొట్టిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.   


నిందితుడు రామచంద్రారెడ్డి  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా