కన్నతల్లిని కడతేర్చాడు

8 Jan, 2018 09:56 IST|Sakshi

ఎలుకల మందు ఇచ్చి హత్యా ప్రయత్నం

వికటించడంతో గొంతు నులిమి హత్య

ఉప్పుగుండూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

సమాధి తవ్వి మృతదేహానికి పోస్టుమార్టం

ప్రకాశం, నాగులుప్పలపాడు: జీవితంలో క్రమశిక్షణ లోపించి చెడు వ్యసనాలకు అలవాటైన కొడుకు జన్మనిచ్చిన తల్లినే హతమార్చాడు. ఈ హృదయవిదారక ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. హత్య విషయం గ్రామంలో చర్చనీయాంశం అయినప్పటికీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాగా విషయం గ్రహించిన ఎస్సై అజయ్‌బాబు కేసును సుమోటోగా స్వీకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

తల్లి పోషణపై ఆధారపడిన నిందితుడు
గత ఏడాది డిసెంబర్‌ 31న జరిగిన ఘటన తర్వాత ఆ మరుసటి రోజే మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే అది హత్యగా అనుమానాలు రావడంతో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ మురళీ కృష్ణ, ఎస్సై అజయ్‌బాబు సమాచారం మేరకు.. ఉప్పుగుండూరు గ్రామంలో దొడ్ల సుబ్బరత్నం అనే మహిళ బస్టాండ్‌ సెంటర్లో జామకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త చాలా ఏళ్ల క్రితం మరణించడంతో ఒక్కగానొక్క కొడుకు రంజిత్‌కుమార్‌ను పోషిస్తోంది. 10 సంవత్సరాల క్రితం తన అక్క మనుమరాలు ప్రసన్నను కొడుకుకు ఇచ్చి వివాహం చేసింది. ఇద్దరు బిడ్డలు కలిగిన తరువాత భర్త ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ప్రసన్న తన పుట్టిల్లు తెనాలికి చేరింది. అప్పటి నుంచి రంజిత్‌ బాధ్యత లేకుండా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బులు కోసం తల్లిని వేధిస్తుండేవాడు. కాగా తన ఇంటి పక్కనే ఉన్న మణి అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ విషయంలో మృతురాలు సుబ్బరత్నం కొడుకును పలుమార్లు హెచ్చరించడంతో పాటు మణిని కూడా హెచ్చరించింది.

దీంతో మృతురాలిపై కక్ష పెంచుకున్న కొడుకు ప్రియురాలు మణి మీ అమ్మ తనను తీవ్రంగా దూషిస్తుందని తెలపడంతో సుబ్బరత్నంను చంపాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం డిసెంబర్‌ 31 రాత్రి వంకాయ కూరలో ఎలుకల మందు కలిపి సుబ్బరత్నంకు అన్నం పెట్టాడు. ఆ తర్వాత చర్చి దగ్గర జరుగుతున్న డ్రామా చూసి తిరిగి వచ్చేసరికి తల్లి మృత్యువుతో పోరాడుతోంది. దీంతో రాత్రి 3 గంటల సమయంలో నిందితురాలు మణి కాళ్లు పట్టుకోవడంతో రంజిత్‌ కుమార్‌ తన తల్లి గొంతు నులిమి హతమార్చి సహజ మరణంగా చిత్రీకరించారు. అయితే ఈ పెనుగులాటలో కాళ్లకు, మోచేతులకు గాయాలయ్యాయి. బంధువులు ఈ గాయాలు ఏంటని అడగడంతో షుగరు ఎక్కువై మంచం మీద నుంచి కింద పడిందని.. నిద్రలోనే ప్రాణాలు పోయినట్టు నమ్మబలికాడు.

ప్రవర్తనలో తేడా పట్టించింది..
అయితే 2వ తేదీ నుంచి మృతురాలి కుమారుడు రంజిత్‌ ప్రవర్తనలో తేడా కనిపించడంతో పాటు అక్కడక్కడ తల్లిని తానే చంపానని చెప్పుకున్నాడు. సమాచారం సేకరించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. ఆదివారం తహసీల్దార్‌ సుజాత, సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రిమ్స్‌ డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ శవానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా