అల్లుడే హంతకుడు

1 May, 2019 13:18 IST|Sakshi
పోలీసులు అదుపులో నిందితుడు రాజేష్‌ఫాండే

మామ కాపురానికి పంపకుండా అడ్డుపడుతున్నాడని హత్య

పోలీసులు అదుపులో నిందితుడు

ఏఎస్పీ గౌతమీశాలి   

గరివిడి: పట్టణ పరిధిలో కొండపాలేం ఏరియా హడ్కో కాలనీలో ఏప్రిల్‌ 28 రాత్రి తమ్మిన చినబాబు(55)ను అతి దారుణంగా హత్య చేసిన రాజేష్‌ పాండేను పోలీసులు అదుపులో ఉంచారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు తానే స్వయంగా హత్య చేశానని  వీఆర్వో నర్శింహమూర్తి వద్ద ఒప్పుకుని  లొంగిపోయాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలి వెల్లడించారు. మృతుడు కుమార్తె మౌనిక, రాజేష్‌ పాండే ఇద్దరూ కొన్నాళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తరువాత వీరి మధ్య  విబేధాలు చోటుచేసుకున్నాయి. మౌనిక తన భర్త నుంచి విడిపోయేందుకు విడాకులకు దరఖాస్తు చేసుకుంది.

ఈ విడాకులు తతంగం అంతా చర్చల దశలోనే ఉంది. తన భార్యను తన వద్దకు రాకుండా తన మామ చినబాబు అడ్డుపడుతున్నారని రాజేష్‌ పాండే ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ హత్యకు కత్తిని వినియోగించినట్టు ఏఎస్పీ తెలిపారు.  రాజేష్‌ పాండే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవాడని, కాకినాడలో కోస్తా గ్రిల్‌ హొటల్‌లో పని చేస్తున్నాడని చెప్పారు. హత్య అనంతరం కాకినాడకు పరారయ్యాడని హోటల్‌ ప్రతినిధులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో పాండేకు ఫోన్‌ చేసి ఎక్కడికి వెళ్లినా  పోలీసులకు దొరికిపోతావు లొంగిపోవడమే మంచిదని రాజేష్‌కు చెప్పడంతో తను కాకినాడలో పోలీసులకు లొంగిపోయాడు. మృతుడు భార్య విజయలక్ష్మి, కుమార్తె మౌనిక ఈ హత్యలో రాజేష్‌తో పాటు మరికొంత మంది ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పూర్తి దర్యాప్తు జరిపి వివరాలు సేకరిస్తామని ఏఎస్పీ తెలిపారు. ఆమె వెంట చీపురుపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రాజులునాయుడు, గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదాం ఎస్‌ఐలు పి.నారాయణరావు, దుర్గాప్రసాద్, పాపారావు, ట్రైనీ ఎస్‌ఐ బి.భాగ్యం తదితర పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు