తల్లిదండ్రులపై హత్యాయత్నం

4 Mar, 2019 13:22 IST|Sakshi

ఆస్తి కోసం తనయుడి అఘాయిత్యం

అనంతపురం, కణేకల్లు: ఆస్తి కోసం జరిగిన ఘర్షణలో క్షణికావేశానికి లోనైన తనయుడు తల్లిదండ్రులపై పెట్రోల్‌ చల్లాడు. పూజగదిలో ఉన్న దీపం నుంచి మంటలు క్షణాల్లో వ్యాపించడంతో తల్లిదండ్రులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాయదుర్గం రూరల్‌ సీఐ సాయినాథ్‌ మీడియాకు వెల్లడించారు. రామనగర్‌లో నివాసముంటున్న పి.నారాయణరెడ్డి (79), నరసమ్మ (73) దంపతులకు శేషారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, హనుమంతరెడ్డిలు సంతానం. వీరికి 2.5 ఎకరాల మాగాణి, రెండు ఇళ్లున్నాయి. ఓ ఇంట్లో తల్లిదండ్రులు, మరో ఇంట్లో మధుసూదన్‌రెడ్డి నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు ఉరవకొండలో నివాసముంటుండగా, చిన్న కుమారుడు భార్యాపిల్లలతో బళ్లారిలో ఉంటున్నాడు. రెండో కుమారుడు మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులుంటన్న ఇంటిపక్కనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఎవరికీ ఆస్తి పంపకాలు చేయలేదు. ఈ నేపథ్యంలో రెండో కుమారుడు మధుసూదన్‌రెడ్డి గత కొన్ని నెలల నుంచి ఆస్తి పంచాలని డిమాండ్‌ చేస్తున్నాడు. అయితే తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. 

ఆస్తి కోసం గొడవ..
ఆస్తి పంపకాల విషయమై ఆదివారం ఉదయం మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులుంటున్న ఇంటికెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆస్తి పంచకపోయినా పర్వాలేదని, కనీసం తానుంటున్న ఇంటినైనా రాసివ్వాలని మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశాడు. పంపకాలు చేసేదీ లేదని తక్షణమే ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలని తల్లిదండ్రులు ఖరాకండిగా చెప్పారు. ఆగ్రహించిన మధుసూదన్‌రెడ్డి పెట్రోలు బాటిల్‌ తీసుకుని ఇంట్లోకి విసిరాడు. అది కాస్తా తల్లిదండ్రులపైకి కూడా పడింది. ఇంతలో దేవునిపటాల ముందు వెలిగించిన దీపాల ద్వారా మంటలు క్షణాల్లో వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బళ్లారివవిమ్స్‌కు పంపారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. రెండో అన్న మధుసూదనే ఆస్తి కోసం హత్యాయత్నం చేశాడని హనుమంతరెడ్డి ఫిర్యాదు చేసినట్లు సీఐ సాయినాథ్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు