మారిన కుమారుడు...

2 Dec, 2017 10:22 IST|Sakshi
తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరిస్తూ మన్నించమంటున్న ప్రసాదు

విజయనగరం, బొబ్బిలి: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సాకుతూ వారి సంక్షేమాన్ని చూడాల్సిన కుమారుడికి పోలీసులు మంచి బుద్ధి వచ్చేలా చేశారు. ఆ కుమారుడ్ని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తల్లిదండ్రుల గొప్పతనం, వారి అవసరం, వారిపై మనకున్న బాధ్యతను వివరించారు. మొత్తంగా ఉదయం నుంచి కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించి తల్లిదండ్రులను గౌరవంగా  చూసుకోవాలోనన్న ఆలోచన కల్పించారు. దీంతో సదరు కుమారుడు తన తప్పు తెలుసుకుని తల్లిదండ్రులను క్షమించమని వారి కాళ్లమీద పడి కోరుకున్నాడు. బొబ్బిలి మండలం పాతపెంట గ్రామానికి చెందిన చనుమల్ల చిన్న, పార్వతి దంపతుల కుమారుడు ప్రసాదు నిత్యం హింసిస్తుండంతో ఆ తల్లిదండ్రులు పోలీసులనాశ్రయించారు.

మద్యం తాగుతూ వచ్చి హింసిస్తున్న సంగతి పోలీసులకు తెలిపారు. మాకు డబ్బులిచ్చి ఇతోధికంగా సాయపడటం లేదని, భార్యను కూడా వదిలేశాడని చెప్పడంతో సీఐ వై.రవి, ఎస్‌ఐ ఎస్‌.అమ్మినాయుడులు ప్రసాదుకు తల్లిదండ్రులకిచ్చే గౌరవం ఎలా ఉండాలో తెలియజేశారు. చాలా సేపు అతని ప్రవర్తనలో మార్పు కనిపించిన తరువాత మళ్లీ వారిపై ఎటువంటి దాడి జరిగినా కఠిన చర్యలు ఉంటాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. దీంతో పరివర్తన చెందిన ప్రసాదు తల్లిదండ్రులను క్షమించమని కోరుకున్నాడు. వారి కాళ్లపై పడి మన్నించమని వేడుకున్నాడు.

మరిన్ని వార్తలు