చేయని దొంగతనం మోపారని యువకుడి ఆత్మహత్య

31 Oct, 2018 13:54 IST|Sakshi
బూసిరాజు గోపి(22)

తల్లిపై దొంగతనం నింద..

టీడీపీ నేత ఒత్తిడితో పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ

తాము దొంగతనం చేయలేదన్న యువకుడు..

గుంటూరు, తాడేపల్లిరూరల్, మంగళగిరిటౌన్‌: చేయని దొంగతనం తమకు అంటకట్టడమేగాక పోలీస్‌స్టేషన్‌లో ఖాకీలు చిత్రహింసలు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకునే ముందు తన ఆవేదనను వ్యక్తపరుస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. చాకలోళ్లమంటే చిన్నచూపా.. చేయని దొంగతనం అంటకడతారా.. అంటూ తన మనోవేదనను వ్యక్తపరుస్తూ అధికారపార్టీ నేతలు, పోలీసుల దౌర్జన్యాన్ని కళ్లకు కట్టాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళగిరిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..

మంగళగిరి రత్నాలచెరువు ప్రాంతంలో నివసించే బూసిరాజు గోపి(22) అక్కడి ఆటోనగర్‌లోని ఓ పరుపుల కంపెనీలో పనిచేస్తున్నాడు. పదిరోజులక్రితం తన తల్లి బట్టలు ఉతికేందుకు వెళ్లే వడిశె సురేష్‌ ఇంట్లో 60 గ్రాముల బంగారం చోరీకి గురైంది. అధికారపార్టీకి చెందినవాడు కావడం, టీడీపీ కౌన్సిలర్‌గా పోటీ చేసిన వ్యక్తి కావడంతో సురేష్‌ తన పలుకుబడి ఉపయోగించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ పెట్టాడు. దీంతో గోపీ తల్లి లక్ష్మిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. కేసు నమోదు చేయకుండా రాతపూర్వక ఫిర్యాదు మీదే విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న గోపీ స్టేషన్‌కెళ్లి పోలీసులను కాళ్లావేళ్లాపడి బతిమిలాడాడు. తాము దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు.

అతన్ని కూడా చిత్రహింసలు పెట్టి.. చేయని తప్పును బలవంతంగా ఒప్పించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన గోపి ఇంటికి చేరాక దూలానికి తాడుతో ఉరేసుకున్నాడు. ఈ సందర్భంగా తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ వీడియో రికార్డు చేశాడు. ‘‘అందరికీ నమస్కారం... నేనే తప్పూ చేయలేదు. మా అమ్మ కూడా ఏ తప్పూ చేయలేదు. లేని దొంగతనం అంటగట్టారు. వాళ్ల వస్తువులు ఎక్కడో పోగొట్టుకొని పోలీసుస్టేషన్‌లో మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. మేం అందరికాళ్లూ పట్టుకున్నాం. బతిమిలాడాం. ఎవరి దగ్గరా న్యాయం జరగలేదు. తీరా నాచేత బలవంతంగా ఒప్పించారు. మేము చాకలోళ్లం. నాలుగిళ్లలో పని చేసుకునేవాళ్లం. మమ్మల్ని ఏ పనికీ పిలవరు. ఏ పనీ చేసుకోకుండా చేశారు.. చిత్రహింసలు పెట్టి బలవంతంగా నాతో తప్పు ఒప్పించారు. ఇంత నింద మోసినాక నాకు బతకాలని లేదు.. నాకు ఓ చెల్లి ఉంది. తన పెళ్లయ్యేలా చూడండి. అంతేచాలు. ఓకే.. గుడ్‌బై.’’ అంటూ వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. అధికారపార్టీ నాయకుల ప్రలోభాలకు తలొగ్గిన పోలీసులు.. గోపీ కుటుంబాన్ని నానాఇబ్బందులకు గురిచేశారని యువకుడి బంధువులు ఆరోపించారు.

నానా హింసలు పెట్టారు
చేయని దొంగతనానికి మమ్మల్ని తీసుకెళ్లి నానా హింసలు పెట్టారు. మోకాళ్లపై కూర్చోపెట్టి నన్ను మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారు. మేము దొంగతనం చేయలేదని చెప్పేందుకు వచ్చిన నా బిడ్డను కూడా స్టేషన్లో పెట్టి ఇష్టానుసారం హింసించారు. తీవ్రంగా గాయపరిచారు. మనస్తాపం చెందిన నా బిడ్డ ఇంటికొచ్చి ప్రాణాలు తీసుకున్నాడు.–లక్ష్మి (మృతుడి తల్లి)

మరిన్ని వార్తలు