తల్లి పేరున ఇన్సూరెన్స్‌ కట్టి హత్య...

27 Jul, 2019 07:43 IST|Sakshi
 కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రకాశరావు 

కన్న కొడుకే కాలయముడు 

వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

సాక్షి, దర్శి: మద్యానికి బానిసై..చేసిన అప్పులు తీర్చలేక చివరకు నవమాసాలు మోసి కని పెంచి సర్వస్వాన్ని ధారపోసిన తల్లిదండ్రులనే అతి కిరాతకంగా కడతేర్చిన కుమారుడి ఉదంతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. కుమారుడన్న పదానికి మాయని మచ్చ తీసుకొచ్చిన హంతకుడిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. డీఎస్పీ ప్రకాశ్‌రావు కథనం ప్రకారం.. పట్టణంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి అన్నపురెడ్డి వెంకటరెడ్డి (80), ఆయన భార్య (52) ఆదెమ్మలు హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటరెడ్డి, ఆదెమ్మ దంపతుల కుమారుడు అన్నపురెడ్డి నారాయణరెడ్డి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. అప్పులు తీర్చమని తల్లిదండ్రులను వేధిస్తూ ఉండేవాడు. పనులు చేసుకుని జీవనం సాగించే తల్లిదండ్రులు ఉన్న ఆస్తిని కూడా అమ్మి నారాయణరెడ్డి అప్పులే తీర్చారు.

అయినా నారాయణరెడ్డి తన ప్రవర్తన మార్చుకోకుండా భార్యను కూడా వేధించడంతో ఏడాది క్రితం ఆమె తన ఇద్దరి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. నారాయణరెడ్డి ప్రస్తుతం దర్శిలోని ముద్ర అగ్రికల్చర్‌ సొసైటీలో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పని చేస్తూ ఖాతాదారుల నుంచి రికవరీ చేసిన డబ్బులో సుమారు రూ.3 లక్షల వరకు సొంతఅ వసరాలు, వ్యసనాలకు వాడుకున్నాడు. డబ్బులు చెల్లించాలని సొసైటీ నిర్వాహకులు నారాయణరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆ నగదు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం లేక పోవడంతో అప్పు తీర్చేందుకు ఆ వృద్ధ దంపతులకు కుమారుడు దుర్మార్గపు ఆలోచనకు తెరలేపాడు. తన తల్లి పేరున మూడు నెలల క్రితం బజాజ్‌ అలియాంజ్‌లో రూ.15 లక్షలకు ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుని నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. గతంలో మెడికల్‌ రిప్రజెంటేటీవ్‌గా చేసిన అనుభవంతో పది రోజుల క్రితం నిద్రమాత్రలు కొనుగోలు చేసి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఈ నెల 21వ తేదీ రాత్రి మజ్జిగలో అధికంగా నిద్రమాత్రలు వేసి పెట్టాడు. ఆ మజ్జిగ తాగిన తల్లిదండ్రులు ఇంటి వెనుక వైపు పడుకున్నారు. తెల్లవారు జాము వరకు వారిని గమనిస్తున్న కుమారుడు ఎంతకూ వారు మరణించక పోవడంతో ముందు తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టి నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి చంపేశాడు. తండ్రిని కూడా చంపేదుకు ప్రయత్నించాడు. తండ్రి నిద్ర లేచేందుకు ప్రయత్నించగా కత్తితో ఆయన గొంతు, మణికట్టు కోసి అతి కిరాతకంగా చంపాడు. అనంతరం అట్ల కాడతో తల్లిదండ్రులు డబ్బు దాచుకునే డబ్బు పెట్టెను పగలగొట్టి డబ్బులున్నాయేమోనని పరిశీలించాడు. 

అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. లోతైన దర్యాప్తు చేసి నిందితుడు మృతుల కన్న కుమారుడిగా గుర్తించి శుక్రవారం నారాయణరెడ్డిని అరెస్టు చేశారు. వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించిన సీఐ మహ్మద్‌ మొయిన్, ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బందిని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అభినందించారని డీఎస్పీ ప్రకాశ్‌రావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు