ఇంటికి కన్నం వేసింది అల్లుడే

11 Mar, 2019 11:56 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ఆభరణాలను చూపిస్తున్న ఎస్‌ఐ విజయ్‌కుమార్‌

పోలీసులకు పట్టుబడిన ఇంటిదొంగ

బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలో రాజాం గ్రామంలో ఓ ఇంటిలో ఆ ఇంటి అల్లుడే చోరీకి పాల్పడ్డాడు. బుచ్చెయ్యపేట ఎస్‌ఐ ఎ.విజయ్‌కుమార్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ గుర్రం నాగమణి గత నెల 23న అమ్మగారి ఊరైన వడ్డాదిలో జరిగే శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. తిరిగి ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం రాజాంలో ఇంటికి రాగా ఇంటిలో బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గుర్తించింది.  బీరువాలో భద్రపరిచిన  ఐదున్నర తులాల బంగారం, పది తులాల వెండి వస్తువుల చోరీ అయినట్టు   బుచ్చెయ్యపేట పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.  క్లూసు టీం,డాగ్‌ స్క్వాడ్‌తో దర్యాప్తు చేశారు.

విచారణలో భాగంగా ఆదివారం ఉదయం బంగారుమెట్టలో ఉన్న నాగమణి అల్లుడు మేరుగు గణేష్‌ ఇంటికి వెళ్తుండగా అతను  పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించాడు.  అతనిని పట్టుకుని విచారించారు. చేసిన అప్పులు తీర్చడానికి తానే అత్తారింట్లో దొంగతనం చేసినట్టు గణేష్‌ అంగీకరించినట్టు ఎస్‌ఐ తెలిపారు. చెడు అలవాట్ల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు అత్తవారింటిలో గణేష్‌    దొంగతనం చేసినట్టు తమ విచారణలో తేలిందని ఎస్‌ఐ చెప్పారు.  నింది తుని  వద్ద నుంచి ఐదున్నర తులాల బంగారు నక్లీస్,చైన్,చెవి దుద్దులు,ఉంగరాలతో పాటు పది తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసికుని కోర్టుకు తరలించామన్నారు. దొంగతనం జరిగిన పది రోజుల్లోనే కేసును ఛేదించామన్నారు.

మరిన్ని వార్తలు