దొంగ అల్లుడు..!

4 Mar, 2019 12:49 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ రామకృష్ణ

చోరీ కేసును ఛేదించిన ఎస్‌ఐ రామ్మోహన్‌

చిత్తూరు, బుచ్చినాయుడుకండ్రిగ : వ్యసనాలకు అలవాటు పడిన ఇంటి అల్లుడే ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడిన సంఘటన మండలంలోని నీర్పాకోట గ్రామంలోని దాసుకాలనీలో చోటుచేసుకుంది. ఆదివారం శ్రీకాళహస్తి డీఎస్పీ రామకృష్ణ స్థానిక పోలీసుస్టేషన్లో సీఐ మధుసూదనరావు, ఎస్‌ఐ రామ్మోహన్‌తో కలసి వివరాలు వెల్లడించారు. దాసుకాలనీకి చెందిన మంగమ్మ.. కుమార్తె అశ్విని, అల్లుడు ఆనంద్‌తో కలసి ఒకే ఇంటిలో కాపురముంటున్నారు.

ఈ నెల 1న మంగమ్మ ఇంటికి తాళం వేసుకుని బుచ్చినాయుడుకండ్రిగలో ఫ్యాన్సీస్టోరుకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ఇంటిలోని బీరువాను పగులగొట్టి 12 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.14,500 నగదు చోరీ చేశారు. ఈమేరకు మంగమ్మ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. క్లూస్‌ టీం రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించారు. అల్లుడు ఆనంద్‌పై పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. చివరకు వ్యసనాలు, వివా హేతర సంబంధం, మద్యం వంటి అవసరాల కోసం తానే చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్టు చేసి సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచాక్యంగా ఛేదించిన ఎస్‌ఐ రామ్మోహన్, ఏఎస్‌ఐ భాస్కర్‌రెడ్డిలను ఆయన అభినందించారు.

మరిన్ని వార్తలు