అయ్యో.. తండ్రి!

28 Jun, 2018 11:14 IST|Sakshi
సత్యనారాయణ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సత్యనారాయణ

కూతురి కాపురం, పరువు పోతుందని ఓ తండ్రి అఘాయిత్యం

చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

అల్లుడి వేధింపులే.. ఊపిరి తీశాయి!

ముగ్గురు కుమార్తెల తండ్రి. అయినా ధైర్యం కోల్పోలేదు. చక్కగా వివాహాలు చేసి అత్తవారింటికి పంపించాడు. ఇక విశ్రాంత జీవితాన్ని భార్యతో కలసి హాయిగా గడుపుదామనుకున్నాడు. కానీ ఇంతలో రెండో కుమార్తె కాపురంలో కలతలు రేగాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కాపురంలో కలతను తట్టుకోలేని ఆ తండ్రి.. చివరకు అల్లుడి వేధింపులు తాళలేక ఉరికొయ్యను ముద్దాడాల్సి వచ్చింది. ఆ వివరాలు ఇలా..  

ద్వారకాతిరుమల : మద్యానికి బానిసైన అల్లుడు నిత్యం తాగొచ్చి తన కూతుర్ని వేధిస్తుండడాన్ని భరించలేకపోయిన ఓ తండ్రి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మండలంలోని కొమ్మర గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్మరకు చెందిన దేనుకొండ సత్యనారాయణ(45), రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరికి వివాహాలయ్యాయి. సత్యనారాయణ కొన్నాళ్లుగా జంగారెడ్డిగూడెంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తూ, భార్యతో కలసి అక్కడే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే తన రెండో కుమార్తె అయిన నాగలక్ష్మిని ఆమె భర్త రాంబాబు నిత్యం తాగొచ్చి కొడుతూ, వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆమె 15 రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో ఉంటున్న తన తండ్రి ఇంటికి వచ్చేసింది. అయితే తన భార్యను కాపురానికి పంపాలంటూ రాంబాబు రోజూ అత్తమామల వద్దకు వచ్చి గొడవ చేస్తున్నాడు. ఎంతో మర్యాదగా అపార్ట్‌మెంట్‌లో బతుకుతున్న తమ పరువు పోతుందని సత్యనారాయణ మానసికంగా క్రుంగిపోయాడు. మంగళవారం సైతం రాంబాబు గొడవ పెట్టుకోవడంతో విసుగు చెందిన సత్యనారాయణ జంగారెడ్డిగూడెం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఇంతలో రాంబాబు తడికలపూడిలోని తన ఇంటి వద్ద గాజు పెంకులు మింగి ఆత్మహత్యాయత్నం చేసి, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్న వార్త అతడికి తెలిసింది. 

కూతురి కాపురం, పరువు కోసం..
ఒక పక్క తన కుమార్తె కాపురం పోతోందని, మరో పక్క పరువు దెబ్బతింటోందని సత్యనారాయణ మానసికంగా నలిగిపోయాడు. చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, తన సొంతూరు కొమ్మరకు బుధవారం ఉదయం వచ్చాడు. గ్రామ శివారులోని ఒక జీడిమామిడి తోటలోకి వెళ్లిన సత్యనారాయణ జీలుగుమిల్లి మండలం దర్బగూడెంలో ఉంటున్న తన మూడో అల్లుడు నూజేడి వెంకన్నబాబుకు ఉదయం 9 గంటల సమయంలో చివరిసారిగా ఫోన్‌ చేశాడు. తన భార్య రాజేశ్వరిని వెంటనే కొమ్మర తీసుకురమ్మని చెప్పాడు. ఈ సమయంలో సత్యనారాయణ ఎంతో ఆవేదనగా మాట్లాడుతున్నట్టు గమనించిన వెంకన్నబాబు పిచ్చిపిచ్చి పనులేవీ చేయొద్దని మందలించాడు. వెంటనే ఫోన్‌ పెట్టేసిన సత్యనారాయణ తోటలోని జీడిమామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన రైతు తీగల సుబ్బారావు విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై ఎస్‌ఎస్‌ఆర్‌ గంగాధర్‌ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు