అశ్లీల చిత్రాలతోనే పిల్లలు తప్పుదారి

26 May, 2018 08:44 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ రాజశేఖర్‌బాబు

చిత్తూరు అర్బన్‌: పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపే గారాబం సమాజంపై ప్రభావాన్ని చూపిస్తోందని చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. చిన్న పిల్లల చేతికి స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వడంతో అందులో అశ్లీల చిత్రాలు చూస్తూ తప్పుదారిలో వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో ఓ బాలికపై ఐదుగురు మైనర్లు రెండు నెలలుగా అత్యాచారం చేయడంపై ఎస్పీ శుక్రవారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయన్నారు. అరెస్టయిన మైనర్ల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు చూస్తే తామే షాక్‌కు గురయ్యామన్నారు.

ఇంగ్లిష్‌ పదాలు టైపు చేయడానికి కూడా చేతగాని పిల్లలు గూగుల్‌ వాయిస్‌ సెర్చ్‌లో అశ్లీల చిత్రాలు చూసి, వాటి ప్రేరణతో బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలిందన్నారు. ఆడ పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలను నివారించడానికి పోలీసు శాఖ ఎన్ని చర్యలు చేపడుతున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం శోచనీయమన్నారు. నిందితులు ఎంతటివారైనా చట్టరీత్యా చర్యలు చేపట్టి శిక్షలు పడేలా చేస్తున్నట్టు వివరిం చారు. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం, అవసరం లేకున్నా వారికి స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వడం వల్లే నేరప్రవృత్తిలోకి వెళుతున్నారని తెలిపారు. త్వరలోనే కలెక్టర్‌తో కలిసి స్వచ్ఛంద సేవాసంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఆడపిల్లల రక్షణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

అత్యాచారం బాధితురాలికి మహిళా కమిషన్‌ :సభ్యురాలి పరామర్శ
గంగవరం: పుంగనూరు భగత్‌సింగ్‌ కాలనీలో అత్యాచారానికి గురై పలమనేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  బాలికను శుక్రవారం రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు పర్వీన్‌ భాను పరామర్శించారు. బాధితురాలు, తల్లితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుతం సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను నిరంతరం గమనిస్తుండాలని చెప్పారు.

ముఖ్యంగా బాలికలకు తల్లిదండ్రులు అన్ని విషయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితులు కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాకు చెందిన వారని, వారిని ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తానని చెప్పారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు అందజేయనున్నట్టు చెప్పారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు బాలురిని తిరుపతి జువైనల్‌ హోంకు తరలించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు