ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

2 Feb, 2018 11:39 IST|Sakshi
ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ రవిప్రకాష్‌

రేప్, ఫోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో మరిన్ని సీసీ కెమెరాలు

ఎస్పీ రవిప్రకాష్‌ వెల్లడి

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌ : జిల్లాలోని పోలీస్‌ శాఖలో పనిస్తున్న అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా మసలుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ సూచించారు. ఏలూరు పోలీస్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఏలూరు సబ్‌డివిజన్‌ పరిధిలో పోలీసుల పనితీరు, గ్రేవ్‌ కేసులు, ప్రజలతో సత్సంబంధాలు వంటి అంశాలను తెలుసుకోవడంతోపాటు రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ రేప్, ఫోక్సో కేసుల విషయంలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు వ్యక్తిగతంగా కోర్టు క్యాలెండర్‌ను తయారుచేసుకుని పర్యవేక్షించాలన్నారు. ఫోక్సో కేసుల నమోదు విషయంలో వయసు ధ్రువీకరణ పత్రాలను ఆధారంగా తీసుకోవాలని తెలిపారు. చట్టాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రమాదాల నివారణకు కార్యాచరణ
జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలుచేస్తామని ఎస్పీ చెప్పారు. జిల్లాలోని ఆయా ముఖ్యపట్టణాలతోపాటు, జాతీయ రహదారులపై సీసీ కెమేరాలను ఆరు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఏలూరు నగరంలో మరో నెల రోజుల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లాలో బాణసంచా అనధికారికంగా తయారుచేసే వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుగుండు సామగ్రి అక్రమంగా నిల్వ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

పనితీరుపై సంతృప్తి
ఏలూరు సబ్‌డివిజన్‌లో పోలీస్‌ అధికారుల పనితీరుపై ఎస్పీ రవిప్రకాష్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలోని పలుస్టేషన్ల పరిధిలో గ్రేవ్‌ కేసులు అధికంగా ఉన్నాయని, రికవరీ కూడా జరుగుతుందని, పనితీరు ఇంకా మెరుగుపడాలని ఎస్పీ చెప్పారు. ఇంకా 30 శాతం కేసులు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. సబ్‌డివిజన్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు కొత్తగా వచ్చారని, అధికారులు పరిస్థితులపై అవగాహన తెచ్చుకుని మెరుగైన పనితీరు కనబరచాలన్నారు. సీపీఓల నియామకాల్లో జాగ్రత్తలు పాటించాలని, సమాజంలో మంచి నడవడిక కలిగిన వ్యక్తులనే నియమించాలని, ప్రస్తుతం 90 శాతం బాగా పనిచేస్తున్నారని తెలిపారు. పనితీరు ఆధారంగా సీపీఓలను ఏడాదికి ఒకసారి మార్పు చేయాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేయటం వల్ల కేసులు పక్కదారి పట్టే అవకాశాలు తగ్గుతాయని ఎస్పీ చెప్పారు.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు
ఏలూరు జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ నేరాల నియంత్రణ, కేసుల నమోదు విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ రవిప్రకాష్‌ సూచించారు. ఏలూరులో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, జూన్‌ నాటికి కొత్తగా పోలీస్‌ సిబ్బంది వస్తున్నారని, వారిని నియమిస్తామని తెలిపారు. ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు, ఏలూరు వన్‌టౌన్‌ సీఐ అడపా నాగమురళీ, టూటౌన్‌ సీఐ జి.మధుబాబు, త్రీటౌన్‌ సీఐ పి.శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ కె.వెంకటేశ్వరరావు, భీమడోలు సీఐ వెంకటేశ్వర నాయక్, ఎస్సైలు కె.రామారావు, ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు, ఎ.పైడిబాబు, నాగేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు