బైక్‌ పోయిందా.. ఇక గోవిందా!

15 Jan, 2018 08:13 IST|Sakshi

నగరంలో విచ్చలవిడిగా ద్విచక్రవాహనాల దొంగతనాలు

కేసులు నమోదు చేయడానికి పోలీసులు వెనుకంజ

సిఫార్సులున్నవాటికి మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లు

సాధారణ వ్యక్తులు మరిచిపోవాల్సిందే..

వారం రోజుల క్రితం పాతూరు మార్కెట్‌లో కూరగాయాలు కొనేందుకు దాసన్న అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో వచ్చాడు. కూరగాయాలు తీసుకొని వచ్చే లోపే బండి మాయమయింది.  పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కంగారుగా వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. ఎప్పుడు పోయింది? ఎలా పోయింది? అని గంటల తరబడి కారణాలు అడిగి సెల్‌ఫోన్‌ నెంబర్‌ తీసుకుని.. ‘నీ బండి దొరికినప్పుడు పిలుస్తాం.. పో’ అని ఓ ఫవర్‌ఫుల్‌ ఎస్‌ఐ చెప్పి పంపించాడు.

ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రెండు నెలల క్రితం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఉద్యోగుల పార్కింగ్‌ స్థలంలో ఉన్న వాహనాన్నే ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై టూ టౌన్‌ సీఐ, ఎస్‌ఐని కలిసి బాధితుడు ఫిర్యాదు చేశా డు. ఇంత వరకూ అతీగతి లేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. కేవలం ఈరెండు స్టేషన్‌న్ల మాత్రమే ప్రతి పోలీస్‌ష్టేషన్‌లోనూ ఇదే తీరు.

అనంతపురం సెంట్రల్‌: జిల్లా కేంద్రంలోని పోలీసుస్టేషన్లలో సిఫార్సులున్న వారికి మాత్రమే పనులు అవుతున్నాయి. సమస్యలపై సామాన్య వ్యక్తులు వస్తే కనీసం స్పందించే నాథుడు కరవుయ్యారు. ముఖ్యంగా కేసుల నమోదులో పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని కేసులు నమోదు చేయాలంటే కూడా బరువుగా మారింది. ముఖ్యంగా ద్విచక్రవాహనాలు ఎత్తుకుపోయారంటే ఇక మర్చిపోవడమే మేలని వాహనదారులు భావించాల్సిన పరిస్థి తి నెలకొంది. ఇటీవల జిల్లా కేంద్రంలో ద్విచక్రవాహనాల దొంగతనాలు అధికమయ్యాయి. వారంలో పది ద్విచక్రవాహనాలకుపైగా దొంగతనాలకు గురవుతున్నాయి. అధికారికంగా ఈ సంఖ్య ఉంటే.. కేసులు నమోదు చేయని వారి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది. దొంగతనాలకు పోలీసులు అడ్డుకట్ట వేయడం పక్కన పెడితే కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదు. దీంతో బాధితులు నెలల తరబడి స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు.

సవాలక్ష కొర్రీలు
ద్విచక్రవాహనాల దొంగతనాలపై కేసులు నమోదు చేయడానికి బాధితులు సిఫార్సులు చేయిస్తున్నా అధికారులు సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు. ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా ఉండాలంటున్నారు. సహజంగా కార్లు, ఆపై వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్‌ సక్రమంగా ఉండేలా వాహనాదారులు చర్యలు తీసుకుంటారు. ద్విచక్రవాహనాలకు ప్రభుత్వశాఖల అధికారుల వాహనాలకే ఇన్సూరెన్స్‌ ఉండదు. సామాన్య ప్రజల ఎవరూ ఇన్సూరెన్స్‌ చేయించుకోరు. దీన్ని సాకుగా తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేయలేదు. మరీ భాదాకరమైన విషయం ఏమిటంటే కొత్త వాహనమైతేనే స్పందిస్తున్నారు. రెండు, మూడేళ్లు  దాటిదంటే అసలు పట్టించుకోవడం లేదు. దీంతో అనేక మంది వాహనాలు పోగొట్టుకున్న ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు. మరి కొందరు ఆశలు చంపుకోలేక కేసు నమోదు చేసి తమ వాహనాన్ని ఇప్పించాలంటూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

సమస్య నా దృష్టికి వచ్చింది
ద్విచక్రవాహనం పోయినా కేసు నమోదు చేయలేదని ఒకటి, రెండు ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదులు వస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తున్నాం. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ద్విచక్రవాహనాల దొంగతనాలపై నిఘా పెట్టాం.   – జె. వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం

మరిన్ని వార్తలు