అందుకే వాహనం బోల్తా పడింది: పోలీసులు

11 Jul, 2020 09:27 IST|Sakshi
వికాస్‌ దుబే(ఫైల్‌)

వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌ అనంతరం ఎస్‌టీఎఫ్‌ ప్రకటన

లక్నో: ఎదురుగా వస్తున్న పశువుల మందను తప్పించేందుకు డ్రైవర్‌ ప్రయత్నించిన క్రమంలో తమ వాహనం అదుపు తప్పి ప్రమాదం సంభవించిందని స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ శుక్రవారం వెల్లడించింది. వాహనం బోల్తా పడగానే వికాస్‌ దుబే పారిపోయేందుకు యత్నించచడం సహా తుపాకీ లాక్కొని తమపై కాల్పులు జరిపినట్లు తెలిపింది. పోలీసుల నుంచి 9ఎంఎం పిస్తోల్‌ లాక్కొన్న దుబే కాల్పులకు దిగాడని.. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు శివేంద్ర సింగ్‌ సెంగార్‌, విమల్‌ యాదవ్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. గ్యాంగ్‌స్టర్‌ను ప్రాణాలతో పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించామని.. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మ రక్షణ కోసం తాము సైతం కాల్పులకు దిగాల్సి వచ్చిందని పేర్కొంది.

ఈ క్రమంలో దుబే గాయపడగా... అతడిని కాన్పూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వెల్లడించింది. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొంది. ఈ మేరకు వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌ అనంతరం స్సెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా పోస్ట్‌మార్టం నివేదికలో దుబే భుజంపై ఒకటి, ఛాతీభాగంలో మూడు బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. (ఇలాంటి చావుకు దుబే అర్హుడే: రిచా)

ఇక వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ వెనుక ఉన్న బడా నాయకులు, పోలీసులను కాపాడేందుకే అతడిని హతమార్చారంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌టీఎఫ్‌ ప్రకటన వాస్తవ కథనాలకు దూరంగా ఉండటం మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎస్‌టీఎఫ్‌కు చెందిన పోలీసులు వెల్లడించిన ప్రకారం.. బోల్తా పడిన వాహనంలోనే దుబే ఉన్నాడు. అయితే అతడిని కాన్పూర్‌ నగర్‌ జిల్లాకు తరలిస్తున్న క్రమంలో ఓ టోల్‌ప్లాజా వద్ద వీడియో ప్రకారం అతడు వేరొక వాహనంలో ఉన్నాడు. అదే విధంగా ఎస్‌టీఎఫ్‌ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న మీడియా వాహనాలను సైతం ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి కంటే దాదాపు రెండు కిలోమీటర్ల ముందే నిలిపివేశారు. పైగా దుబే చేతులకు సంకెళ్లు కూడా వేయకపోవడం గమనార్హం.(వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్: అనేక అనుమానాలు!)

మరిన్ని వార్తలు