వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

20 Apr, 2019 16:55 IST|Sakshi

గీసుకొండ(పరకాల): వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారాపుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సింగారపు యాకోబు, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు అనిల్‌(35), అశోక్, ఇద్దరు కుమార్తెలు అరుణ, కరుణ ఉన్నారు. యాకోబు పెద్ద కుమారుడు అనిల్‌ కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్‌ లేబర్‌కాలనీలో నివాసం ఉంటూ గొర్రెకుంటలోని కేకుల తయారీ కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అరుణకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె, కుమారుడు జల్లి గ్రామంలోనే ఉండగా.. మరో కూతురు గొర్రె సాత్విక(09) అనిల్‌ ఇంటిలోనే ఉంటూ ధర్మారంలోని ప్రైవేట్‌ పాఠశాలలో ఇటీవలే 3వ తరగతి పరీక్షలు రాసింది.

ఈ క్రమంలో స్వగ్రామం జల్లిలో ఈస్టర్‌ పండుగ చేసుకోవడానికి సింగారపు అనిల్‌(35) శనివారం సాయంత్రం కవలలైన తన ఇద్దరు కూతుర్లు జాహ్నవి, జాస్నవి(జాస్విన్‌)(6)లతో పాటు  చెల్లి అరుణ కూతురు సాత్వికను వెంటతీసుకుని బైక్‌పై బయలుదేరాడు. సాయంత్రం 4 గంటల సమయంలో గీసుకొండ మండలం వరంగల్‌–నర్సంపేట రహదారిలో కొమ్మాల ప్రాంతానికి చేరుకోగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అనిల్‌తో పాటు అతడి కూతురు జాస్విన్, చెల్లెలి కూతురు గొర్రె సాత్విక అక్కడే మృతి చెందారు. అనిల్‌ మరో కూతురు జాహ్నవి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండగా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు.

మద్యం మత్తులో కారు డ్రైవర్‌
కారు డ్రైవర్‌ మద్యం తాగి అతి వేగంగా నడపడంతో ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారు ప్రమాద స్థలికి వచ్చే కొద్ది దూరంలో తాగిన ఖాళీ బీరు సీసాలను పంటచేలలోకి విసిరి వేసినట్లు చెబుతున్నారు. అలాగే కారు రోడ్డు సగం భాగం దాటి దూసుకు వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్‌ కారు దిగటంతో అక్కడ గుమికూడిన వారు తాగి ప్రాణాలు తీసావంటూ అతడిని కొట్టినట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్‌జోన్‌ డీసీపీ నాగరాజు, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ సీఐ సంజీవరావు, ఎస్సై అబ్దుల్‌ రహీం సందర్శించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

రెండు కుటుంబాల్లో విషాదం
చెన్నారావుపేట: ఒకే కుటుంబంలోని తండ్రీ కూతురుతోపటు తోబుట్టువు కూతురు మృత్యువాత పడడంతో జల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలియగానే కుటుంబాల సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. అనిల్‌ భార్య సునీత 6 నెలల గర్భవతి కావడంతో ఆమె ఇంటి వద్దనే ఉంది. బంధువులు, కుటుంబ సభ్యులు జల్లి గ్రామంలోని ఇంటి వద్ద రోదిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కలిచివేసింది. అరుణ కుమారుడు, కుమార్తె ఏం జరిగిందో తెలియని స్థితిలో అమాయకంగా దిక్కులు చూస్తుండ చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.

మరిన్ని వార్తలు