అసత్య ప్రచారాలు చేస్తే కేసులు

29 May, 2018 07:29 IST|Sakshi

సీపీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం : వాట్సాప్, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్‌ మీడియా అసత్య ప్రచారాలను పోస్టు చేసేవారిని గుర్తించేందుకు కరీంనగర్‌ సోషల్‌ మీడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వివిధ రకాల గ్రూపుల నుంచి పోస్టు చేసిన వ్యక్తులతోపాటు గ్రూప్‌ అడ్మిన్లపై క్రిమినల్‌ కేసులు తప్పవని, ప్రజలను భయబ్రాంతులను గురి చేసే పోస్టులు పంపినవారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు కొందరిని గుర్తించామని, మరి కొందరిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేస్తున్నారని, వివిధ రాష్ట్రాల దొంగ ముఠా సభ్యులు గొంతు కోస్తున్నారని, మెదడు తింటున్నారని వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. దొంగలొస్తున్నారని ప్రజలు రాత్రి కర్రలు పట్టుకొని ఆపరిచితులను చితకబాదుతున్నారని అన్నారు. వారిపై క్రిమనిల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇటుకబట్టీలు, గ్రానైట్‌ క్వారీలు, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఇతర రాష్ట్రాలవారు ఎక్కువగా పని చేస్తున్నారని, వారికి స్థానిక భాష రాకపోవడంతో అనుమానిస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులు, డయల్‌ 100కు సమాచారం అందించాలని, కేవలం 10 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటారని వివరించారు.

నాన్‌ బెయిలెబుల్‌ వారెంట్లకు ప్రత్యేక బృందాలు
కరీంనగర్‌ కమిషనరేట్‌ పెండింగ్‌లో ఉన్న నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్ల అమలు వేగవంతం చేసేందుకు 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. ఈనెల 31 వరకు ఈ బృందాలు పని చేస్తాయని, మరో 4బృందాలను కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. మొదట కరీంనగర్‌ కమిషనరేట్‌ తర్వాత పక్కా జిల్లాలు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్లు పూర్తి చేసిన తర్వాత ఇతర జిల్లాలకు బృందాలను పంపిస్తామని తెలిపారు. గడిచిన మూడు రోజుల్లో 55 వారెంట్లు అమలు చేశామని, కమిషనరేట్‌వ్యాప్తంగా 800కి పైగా నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అమలు చేసే ప్రతి వారెంట్‌కు రూ.750 రివార్డు, ఎక్కువ వారెంట్లు అమలు చేసినవారికి ప్రశంసాపత్రాలు అందిస్తామని తెలిపారు.  

మరిన్ని వార్తలు