దక్షిణ కొరియాలో రహస్య లైంగిక దోపిడి

12 Jun, 2018 15:09 IST|Sakshi

‘నేను కొరియన్‌ పోర్న్‌ కాదు’

ఈ నినాదం ఇప్పుడు దక్షిణ కొరియాను ఊపేస్తుంది. దాదాపు 20 వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చి దేశంలో మహిళల పట్ల జరుగుతున్న ‘రహస్య లైంగిక దోపిడి’కి వ్యతిరేకంగా నినాదించారు. ప్రస్తుతం కొరియా దేశాల వైపే ప్రపంచం మొత్తం చూస్తోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ భేటీ కాగా మరొకటి దక్షిణ కొరియాలో రహస్య లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడం. వివరాలు.. 2010 నుంచి దక్షిణ కొరియాను పోర్న్‌ భూతం పట్టిపిడిస్తుంది.

రహస్య కెమెరాలలో నగ్నంగా చిత్రికరించబడి సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కినవారు కోకొల్లలు. బస్సుల్లో, బస్‌ స్టాపుల్లో, పబ్లిక్‌ టాయిలెట్లలో ఎక్కడపడితే అక్కడ రహస్య కెమెరాలు పెట్టి మహిళల జీవితాలను ఆన్‌లైన్‌ పాలు చేస్తున్నారు. ఈ రహస్య పోర్న్‌ భూతానికి బలైంది కేవలం మహిళలే కాదు, ఈ జాబితాలో మగవారు కూడా ఉండటం గమనార్హం. గత నెల ఓ ప్రముఖ యూనివర్సిటీలో 25 ఏళ్ల యువకుడి నగ్న ఫొటోలను రహస్యంగా చిత్రీకరించిన యువతి వాటిని సామాజిక మాధ్యమాల్లో, పోర్న్‌ సైట్లలో పెట్టింది.

ఆ యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినా పూర్తి స్థాయి దర్యాప్తును నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో దేశంలో పెరిగిపోతున్న ‘స్పై కెమెరా పోర్న్‌’ను ప్రభుత్వం పట్టించుకోట్లేదని ప్రజలు ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ భారీ ర్యాలీ నిర్వహించిన సంస్థ ‘కరేజ్‌ టూ బీ అన్‌కంఫర్టబుల్‌’ గతంలో కూడా ఇలాంటి ర్యాలీని చేపట్టింది. ఈ రహస్య పోర్న్‌ను దక్షిణ కొరియాలో ‘మోల్కా’ గా పేర్కొంటారు. దాదాపు 6000 మందికి పైగా ఈ మోల్కా కేసులలో అరెస్ట్‌ అయ్యారు. ఇందులో మగవారితో పాటు ఆడవారు కూడా ఉన్నారు. ఈ రహస్య పోర్న్‌ వీడియోల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఈ ఆధునిక టెక్నాలజీనే అని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు