వీడిన యువకుడి మర్డర్‌ మిస్టరీ

7 Jul, 2019 13:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇద్దరు యువకుల అనైతిక బంధంతో ...ఓ నిండు జీవితం అర్థాంతరంగా ముగిసింది. మూడు రోజుల క్రితం ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఓ హోటల్‌లో యువకుడి అనుమానస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఎస్ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని క్రిష్‌ ఇన్‌ హోటల్‌ లాడ్జీలో 4వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కొండా శ్రీకాంత్‌రెడ్డి (29) హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయ్‌లో పనిచేస్తున్న శ్రీకాంత్ ఇటీవల తన స్వగ్రామానికి వచ్చాడు. గత నెలలో అతడికి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని తన స్నేహితుడైన మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం, మూసల్‌పూర్ గ్రామానికి చెందిన డబ్బి నరేశ్‌కు తెలిపాడు. అయితే ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయిన శ్రీకాంత్‌రెడ్డి, నరేష్‌ మధ్య అనైతిక సంబంధానికి దారి తీసింది. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య స్వలింగ సంపర్కం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌రెడ్డికి పెళ్లి కుదరటాన్ని నరేశ్‌ జీర్ణించుకోలేక పోయాడు. నిశ్చితార్థం అనంతరం తిరిగి దుబయ్‌కి బయలుదేరిన శ్రీకాంత్‌రెడ్డి ఒక రోజు ముందుగానే గుంటూరులోని స్వగ్రామం నుంచి నగరానికి వచ్చి నరేశ్‌ను కలుసుకున్నాడు. ఇద్దరు లాడ్జి తీసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ఎందుకు అంగీకరించావని, తనను విడిచి వెళ్లి పోతావా అంటూ నరేశ్‌ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో నరేష్‌ ఆగ్రహంతో గురువారం మధ్యాహ్న సమయంలో కత్తిలో శ్రీకాంత్‌రెడ్డి గొంతు కోశాడు.

అయితే శ్రీకాంత్ మృతి చెందటంతో భయంతో సాయంత్రం నరేశ్ కూడా గొంతు కోసుకోవడంతో రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాంత్‌రెడ్డి మృతి చెందడం, నరేష్‌ అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరడం, ఇద్దరి గొంతులపై కత్తిపోట్లు  ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  స్పృహలోకి వచ్చిన నరేశ్‌ శుక్రవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన విషయమై పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారుల అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

మరిన్ని వార్తలు